20 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’

(సెప్టెంబర్ 6న ‘నువ్వు నాకు నచ్చావ్’ కు 20 ఏళ్ళు)

వెంకటేశ్ హీరోగా కె.విజయభాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిశోర్ నిర్మించిన చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’. 2001 సెప్టెంబర్ 6న ‘నువ్వు నాకు నచ్చావ్’ విడుదలయింది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ సినిమా రూపొందింది. ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం జనాన్ని భలేగా ఆకట్టుకుంది.

‘నువ్వు నాకు నచ్చావ్’ కథ ఏమిటంటే – శేఖర్, పిన్నమనేని శ్రీనివాస మూర్తి బాల్యమిత్రులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. శ్రీనివాస మూర్తి ఎదుగుదలకు శేఖర్ సాయపడి ఉంటాడు. పట్నంలో శ్రీనివాస మూర్తి కోటీశ్వరుడవుతాడు. అతని వద్దకు తన కొడుకు వెంకీని పంపించి, ఏదైనా ఉద్యోగం చూడమంటాడు. అదే సమయంలో శ్రీనివాస మూర్తి కూతురు నందినికి ఓ అబ్బాయితో వివాహం నిశ్చయమై ఉంటుంది. వెంకీ, శ్రీనివాస మూర్తి గెస్ట్ హౌస్ లో ఉంటూ, ఉద్యోగం చేసుకుంటాడు. అతణ్ణి నందిని, ఆమె చిన్నాన్న కూతురు కలసి ఆటపట్టిస్తూ ఉంటారు. ఓ పెళ్ళికి నందిని, చిన్నాన్న కూతురు వెళ్ళాలను కుంటారు. వారికి తోడుగా వెంకీ వెళ్ళాల్సి వస్తుంది. ఆ సమయంలోనే వెంకీ, నందిని మధ్య అభిమానం చిగురించడం, తరువాత ప్రేమగా మారడం జరుగుతాయి. అయితే వెంకీ వద్దని వారిస్తాడు. అయినా నందిని అతణ్ణే చేసుకోవాలనుకుంటుంది. వారికి టూర్ లో ఓ ఫోటో్గ్రాఫర్ తగులుతాడు. అతను వెంకీ, నందినీ ఫోటోలు తీసి ఉంటాడు. పొరపాటున ఆ ఫోటోలు పెళ్ళి రోజున పెళ్ళికొడుకు చేతికి చిక్కుతాయి. దాంతో పెళ్ళికుమారుని తండ్రి కట్నం పెంచితే ఫర్వాలేదు. లేదంటే నీ కూతురు బండారం బయట పెడతానంటాడు. దానికి శ్రీనివాస మూర్తికి కోపం వస్తుంది. నానా మాటలు అంటాడు. పెళ్ళికొడుకు, అతని బంధువులు వెళ్ళిపోతూంటే వెంకీ వెళ్ళి వారిని ప్రాధేయ పడతాడు. ఈ లోగా వెంకీ మంచి మనసు తెలుసుకున్న శ్రీనివాస మూర్తి, అతనికే తన కూతురును ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. దాంతో కథ సుఖాంతమవుతుంది.

ఇందులో వెంకీగా వెంకటేశ్, నందినిగా ఆర్తి అగర్వాల్ కనిపించగా, ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, బాబూమోహన్, మల్లికార్జునరావు, ఎమ్మెస్ నారాయణ, సిజ్జు, పృథ్వీ, ఆశా షైనీ, సునీల్, అనంత్, చిట్టిబాబు తదితరులు నటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచన చేశారు. కోటి స్వరాలు సమకూర్చగా, సీతారామశాస్త్రి, భువనచంద్ర పాటలు రాశారు. “ఉన్నమాట చెప్పనీవు… ఊరుకుంటే ఒప్పుకోవు…”, “ఓ నవ్వు చాలు…”, “ఆకాశం దిగివచ్చి…”, “నా చూపే నిను…”, “ఓ ప్రియతమా…”, “ఒక్కసారి చెప్పలేవా…” పాటలు అలరించాయి.

అప్పటికే ‘నువ్వే కావాలి’ ఘనవిజయంతో దర్శకుడు కె.విజయభాస్కర్, రచయిత త్రివిక్రమ్ కాంబినేషన్ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమాకు కూడా ఆరంభం నుంచీ మంచి క్రేజ్ లభించింది. ఆ రోజుల్లో వెంకటేశ్ చిత్రాలలో అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా ‘నువ్వు నాకు నచ్చావ్’ నిలచింది. 57 కేంద్రాలలో శతదినోత్సవం చూసిన ఈ చిత్రం మూడు కేంద్రాలలో రజతోత్సవం కూడా జరుపుకుంది. ఈ చిత్రం తమిళంలో విజయ్ హీరోగా ‘వశీగర’గానూ, కన్నడలో ఉపేంద్రతో ‘గౌరమ్మ’గానూ రూపొంది విజయం సాధించింది. బెంగాల్ లో ‘మజ్ను’గా రీమేక్ అయింది.

నంది అవార్డుల్లో సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రానికి ఇచ్చే అక్కినేని అవార్డును ఈ సినిమా సొంతం చేసుకుంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సుహాసిని, బెస్ట్ రైటర్ గా త్రివిక్రమ్, బెస్ట్ కొరియాగ్రాఫర్ గా సుచిత్ర, బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సవితా రెడ్డి నంది అవార్డులు అందుకున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-