ఇరవై ఏళ్ళ ‘ఆనందం’

(సెప్టెంబర్ 28న ‘ఆనందం’కు 20 ఏళ్ళు)

ఆకాశ్ హీరోగా నటించిన చిత్రాలన్నిటిలోకి ది బెస్ట్ ఏది అంటే ‘ఆనందం’ అనే చెప్పాలి. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రామోజీరావు నిర్మించిన ‘ఆనందం’ ప్రేమకథగా తెరకెక్కి జనాన్ని ఆకట్టుకుంది. 2001 సెప్టెంబర్ 28న ‘ఆనందం’ విడుదలయింది. యువతను విశేషంగా అలరించింది.

‘ఆనందం’ కథ ఏమిటంటే – కిరణ్, ఐశ్వర్య ఇరుగుపొరుగువారు. చిన్నప్పటి నుంచీ వారిద్దరికీ పడదు. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాలేజీలోనూ తరచూ గొడవలు పడుతూ ఉంటారు. ఐశ్వర్య తండ్రికి బదిలీ కావడంతో వారు ఊటీకి వెళతారు. అక్కడ ఐశ్వర్య వాళ్లు దిగిన ఇంటిలో ఆమెకు ఓపెన్ చేయని ఓ కవర్ కనిపిస్తుంది. అంతకు ముందు ఆ ఇంటిలో ఉన్న దీపిక అనే అమ్మాయికి వచ్చిన ఉత్తరం అని తేలిపోతుంది. అయితే దీపిక ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుస్తుంది. కానీ, ఉత్తరాలు వంశీ పేరుతో వస్తూఉంటాయి. దీపిక ప్రియుడు వంశీ, ఆమె బతికే ఉందని భావిస్తున్నాడని అనుకుంటుంది ఐశ్వర్య. అతణ్ణి సంతృప్తి పరచడానికి అన్నట్టు ఐశ్వర్య, దీపిక పేరుతో ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. ఆ ఉత్తరం చేరే చిరునామా ఎవరిదో చూడదు. అది కిరణ్ దే! ఒకరినొకరు ఎంతగానో ద్వేషించుకొనే కిరణ్, ఐశ్వర్య ఉత్తరాల్లో మాత్రం ప్రేమ పంచుకుంటూ ఉంటారు. ఓ రోజు ఇద్దరూ కలుసుకోవాలని భావిస్తారు. ఊటిలో చెప్పిన ప్లేస్ లో కిరణ్, ఐశ్వర్య కలుసుకుంటారు. అయితే ఎప్పటిలాగే పోట్లాడుకుంటారు. కాసేపటికి అసలు విషయం తెలుసుకుంటారు. వంశీ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, అతను కూడా యాక్సిడెంట్ లో చనిపోయాడని అది దీపికకు తెలియకూడదనే తాను ఉత్తరాలు రాస్తూ ఉన్నానని చెబుతాడు కిరణ్. అతని మంచి మనసు తెలుసుకొని ఐశ్వర్య కూడా చలించిపోతుంది. ఎవరి గమ్యాలకు వాళ్ళు వెళతారు. కానీ, ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరాధన పెంచుకుంటారు. చివరకు ఇద్దరూ ఒకటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది.

ఈ కథను శ్రీను వైట్ల నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి ముందు శ్రీను వైట్ల తెరకెక్కించిన తొలి సినిమా ‘నీ స్నేహం’ ను రామోజీరావుకు చెందిన మయూరి సంస్థ ద్వారా విడుదల చేశారు. ఆ సినిమా జనాన్ని ఆకట్టుకుంది. దాంతో శ్రీను వైట్లకు ఉషాకిరణ్ మూవీస్ లో పనిచేసే అవకాశం లభించింది. ‘ఆనందం’తో శ్రీను వైట్ల దర్శకునిగా మంచి మార్కులు సంపాదించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇది దేవిశ్రీ కి మూడో సినిమా కావడం విశేషం. ఇందులో సీతారామశాస్త్రి రాసిన “ఎవరైనా ఎపుడైనా సరిగా గమనించారా… చలి చెర అసలెప్పుడు వదిలిందో…” అంటూ పురుష స్వరంలో వినిపించే పాట తరువాత “ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూశారా నడిరాతిరి తొలి వేకువ రేఖ…” అంటూ అమ్మాయి స్వరంలో వినిపిస్తుంది. ఈ రెండు పాటలూ భలేగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇందులోని “కనులు తెరచినా కనులు మూసినా కలలు ఆగవేళ…”, “ప్రతి నిమిషం ఆనందం…”, “మోనాలిసా…మోనాలిసా…”, “ప్రేమంటే ఏమిటంటే…”, “ఒక మెరుపు మెరిసె నయనంలో…” వంటి పాటలు కూడా ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో ఆకాశ్ సరసన రేఖ, వెంకట్ జోడీగా తనూ రాయ్ నటించారు. చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు, బ్రహ్మానందం, చిత్రం శ్రీను, శివారెడ్డి, సుధ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, బెనర్జీ, జెన్నీ ఇతర పాత్రల్లో కనిపించారు.

‘ఆనందం’ చిత్రం మంచి విజయం సాధించింది. దాంతో ఉషాకిరణ్ మూవీస్ ఈ సినిమాను తమిళంలో ‘ఇనిదు ఇనిదు కాదల్ ఇనిదు’ పేరుతోనూ, కన్నడలో ‘ఆనంద’ పేరుతోనూ రీమేక్ చేసింది. ఈ చిత్రం తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలోనే ఆకాశ్ హీరోగా ‘ఆనందమానందమాయె’ అనే మరో చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ నిర్మించింది. ఆ చిత్రం ‘ఆనందం’ రేంజ్ లో అలరించలేకపోయింది. ఇక ఆకాశ్ సోలో హీరోగా నటించిన చిత్రాలలో ‘ఆనందం’ స్థాయి విజయం మళ్ళీ అతనికి దక్కలేదు. ఆకాశ్ దర్శకత్వంలో ‘ఆనందం’కు సీక్వెల్ గా ‘ఆనందం ఆరంభం’ అనే చిత్రం రూపొందించారు. అయితే ఇప్పటి దాకా ఆ సినిమా వెలుగు చూడలేదు.

-Advertisement-ఇరవై ఏళ్ళ 'ఆనందం'

Related Articles

Latest Articles