గుడ్‌న్యూస్‌.. తెలంగాణ‌లో 19 ప్ర‌భుత్వ‌ డయాగ్నోసిస్ సెంటర్లు..

మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు.. రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డ‌యాగ్నోసిస్ సెంట‌ర్లు) ఈనెల‌ 7న ప్రారంభించాలని నిర్ణ‌యించారు.. మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్.. జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్న ఆ కేంద్రాల‌ను ప్రారంభించాలని వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి , రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, పలు అంశాల మీద అధికారులతో చర్చించారు. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్షా కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా వున్నాయనే విషయాన్ని, వైద్యాధికారులు తన దృష్టికి తెచ్చిన నేపథ్యంలో, వాటిని సోమవారం నుంచి ప్రారంభించాలని ఆదేశించారు కేసీఆర్.

రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు సీఎం కేసీఆర్.. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో , రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామన్నారు. ప్రజలకు ఉచిత వైద్యకోసం ఇప్పటికే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. గత పాలనలో ఆగమైన వైద్య రంగాన్ని అనతికాలంలోనే ప్రభుత్వం పునరుజ్జీవింప చేసిందన్నారు. సామాన్యుడికి వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేస్తున్నదన్నారు సీఎం.. వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా (డయాగ్నోసిస్) కేంద్రాలను తెలంగాణలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భమని తెలిపారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తిచేసుకుని ప్రారంభానికి సిద్దంగా వున్న 19 కేంద్రాల్లోని డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని సిఎం తెలిపారు. ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. పేదలకు జబ్బు చేస్తే నయం చేసుకుందానికి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. రోగం కంటే రోగ పరీక్షల ఖరీదు మరీ ఎక్కువైంది.. రోగ నిర్ధారణ జరగాలంటే రక్తం మూత్రం వంటి పరీక్షలు జరపాల్సిందే. ఈ నడుమ ప్రతి మనిషికి బీపీలు షుగర్లు ఎక్కువ‌య్యాయ‌న్నారు.. వాటి పరీక్ష చేయించుకోవాలి. గుండె ,కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, క్యాన్సర్‌, థైరాయిడ్ తదితర జబ్బులకు సంబంధించిన పరీక్షలు నిత్యం సామాన్యులకూ పేదలకు అవసరంగా మారాయ‌ని.. ఈ మధ్యకాలంలో కరోనా వ్యాధి ఒకటి కొత్తగా జబ్బుల లిస్టులో వచ్చి చేరింద‌ని.. దానికీ పలు రకాల పరీక్షలు వున్నాయి.. ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు.. కానీ పరీక్ష కోసం ఎక్కడికో ప్రయివేట్ సెంటర్లకు పోయి వేలకు వేలు ఖర్చు చేసి పరీక్షలు చేయించుకోవాల్సి వ‌స్తుంద‌ని.. దీనివల్ల పేదలకు విపరీతమైన ఆర్ధిక భారం ప‌డుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కరోనా నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఇంకా కరోనా చికిత్స కోసం అవసరమైన ఇతర పరీక్షల కోసం కూడా పేదలు నానా అవస్థలు పడుతున్నార‌న్నారు కేసీఆర్.. ఈ నేపథ్యంలో.. వైద్యాన్ని అందిచడమంటే కేవలం డాక్టర్లు మందులు సూదులు మాత్రమే కాదనీ, పరీక్షలు కూడా అత్యంత ప్రధాన్యత అంశంగా ప్రభుత్వం భావించింది. ఈ మేరకు తక్షణం 19 జిల్లాల్లో డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇంకా అవసరమైన చోట్ల దశల వారీగా డయాగ్నోసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అన్నారు సీఎం.. ఇటువంటి ఏర్పాటు ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మకమైనదని, పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తున్నదనేదానికి నిదర్శనమని సిఎం అన్నారు. ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోసిస్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు సీఎం.. అందులో కరోనా పరీక్షలతో పాటుగా… రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ సుగర్ గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే బయోకెమిస్ట్రీ పాథాలజీ కి సంబంధించిన పలు పరీక్షలు వుంటాయ‌న్నారు.. సాధారణ పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులిస్తారని వెల్ల‌డించారు.. నిర్దారించిన రిపోర్టులను ఆయా రోగుల సెల్ ఫోన్లకు మెసీజీల రూపంలో పంపించే ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసిందన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-