15 ఏళ్ళ ‘యోగి’

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో పి.రవీంద్రనాథ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘యోగి’. ఈ చిత్రంలో నయనతార నాయికగా నటించింది. కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ‘జోగి’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. 2007 జనవరి 14న విడుదలైన ‘యోగి’ మాస్ ను ఆకట్టుకుంది.

‘యోగి’ కథ ఏమిటంటే- కన్నతల్లి అతిగారాబంతో ఈశ్వర చంద్రప్రసాద్ ఏ పనీపాటా చేయడు. తండ్ర మూర్తి చివరి కోరిక ఈశ్వర్ ప్రయోజకుడు కావాలన్నది. దాంతో పట్నంలో ఉన్న మిత్రుడు బాషా దగ్గరకు వెళ్ళాలనుకుంటాడు ఈశ్వర్. కానీ, అనుకోకుండా అతని కథ మలుపు తిరుగుతుంది. ల్యాండ్ మాఫియా గొడవల్లో చిక్కుకుంటాడు. తాను బతకాలంటే ఎదురొచ్చిన వాణ్ణి నలిపేయాలని తెలుసుకుంటాడు. అతను దాదాగిరి చేయడం మొదలెట్టాక చాలామంది సామాన్యులు సంతోషంగా ఉంటారు. అందరూ అతణ్ణి యోగి అని పిలుస్తూ ఉంటారు. ఇది తెలిసిన నందిని అనే జర్నలిస్ట్ తన ప్రాక్టికల్స్ లో భాగంగా అతణ్ణి ఇంటర్వ్యూ చేయాలని తపిస్తూ ఉంటుంది. ఈ లోగా పట్నంలో కొడుకు ఎలాంటి కష్టాలు పడుతున్నాడో అని చూడటానికి వస్తుంది తల్లి. అనుకోకుండా ఆమెకు బాషా తారసపడతాడు. ఓ గుడికి ప్రతి సోమవారం ఈశ్వర్ వస్తాడని చెబుతాడు బాషా. కొడుకు వస్తాడని ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమెకు నందిని కూడా కనిపిస్తుంది. యోగి తల్లి ఆమే అని నందినికి తెలియక పోయినా, సహాయం చేస్తానంటుంది. చివరకు ఆమె ఇచ్చిన ఆధారాలను బట్టి యోగియే ఆమె కొడుకు అని తెలుసుకుంటుంది. ఈ లోగా యోగి తల్లి కన్నుమూస్తుంది. ఆమె శవాన్ని అనాథలా తీసుకుపోతారు. ముఖం చూడకుండానే ఆమె పార్తివదేహంపై పూలు చల్లి, ఖర్చులకు డబ్బు ఇస్తాడు యోగి. తరువాత బాషా వచ్చి, విషయం చెబుతాడు. అప్పటికే ఆలస్యమై పోయి ఉంటుంది. తల్లి తుది చూపుకు నోచుకోలేక పోతాడు యోగి. నందిని వచ్చి, అతని తల్లి ఇచ్చిన వాటిని చూపిస్తుంది. వాటిని పట్టుకొని యోగి దుఃఖిస్తూ ఉండగా కథ ముగుస్తుంది.

కరుణరసం కురిపించే ఈ కథ జనం కంట నీరు పెట్టించింది. యోగిగా ప్రభాస్ నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, ఆలీ, శారద, చలపతిరావు, చంద్రమోహన్, ఫిష్ వెంకట్, దేవరాజ్, రాజన్ పి.దేవ్, ఎమ్మెస్ నారాయణ, బండ్ల గణేశ్, రఘు కారుమంచి, సునీల్ నటించారు. ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు ప్రేమ్ రాసిన ఈ కథకు రాజేంద్రకుమార్ సంభాషణలు రాశారు. ఈ చిత్రానికి రమణ గోగుల పాటలకు సంగీతం సమకూర్చగా, మణిశర్మ నేపథ్యం అందించారు. “ఓరోరి యోగి నను కొరికొయ్ రో…” పాట ట్యూన్ కన్నడ ఒరిజినల్ నుండే తీసుకున్నారు. “ఏ నోము నోచిందో…”, “గిల్లి గిల్లి…”, “నీ ఇల్లు బంగారం కాను…”, “గాన గాన గాన…” అంటూ మొదలయ్యే పాటలు అలరించాయి. ‘యోగి’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా, ప్రభాస్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది.

Related Articles

Latest Articles