రుసరుసలాడుతోన్న మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి !

కొత్త పీసీసీ చీఫ్‌ రావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో సమీకరణాలు మారతాయా? ఆ మాజీ మంత్రి చుట్టూ ఎందుకు చర్చ జరుగుతోంది? రేవంత్ వర్గం దూకుడు దేనికి సంకేతం?

2018లో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం దామోదర్‌రెడ్డి పోరాటం!

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి. మాజీమంత్రి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుల్లో ఒకరు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఆయనకు కేడర్‌ ఉంది. కానీ.. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు.. స్థానిక రాజకీయ పరిణామాల కారణంగా 2014 నుంచి గెలిచింది లేదు. సూర్యాపేటలో రెండుసార్లు మంత్రి జగదీష్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో అయితే ఈ సీనియర్‌ నేత కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది.

రేవంత్‌ అనుచరుడు రమేష్‌రెడ్డితో వైరం!

అప్పట్లో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డితోపాటు సూర్యాపేటకు చెందిన పటేల్‌ రమేష్‌రెడ్డి కూడా కండువా మార్చేశారు. 2018 ఎన్నికల్లో టికెట్‌ కోసం రమేష్‌ రెడ్డి నుంచి పోటీ ఎదుర్కొన్నారు దామోదర్‌రెడ్డి. జిల్లాకే చెందిన నాటి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి సాయంతో దామోదర్‌రెడ్డికి టికెట్‌ వచ్చిందని చెబుతారు. అయితే ఆ ఎన్నికల్లో దామోదర్‌రెడ్డి ఓడిపోవడంతో పటేల్‌ రమేష్‌రెడ్డి వర్గం కొత్త ప్రచారం మొదలుపెట్టింది. రమేష్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చి ఉంటే గెలిచేవారని కామెంట్స్‌ చేశారు. ఇప్పటికీ సమయం చిక్కితే ఆ అంశాన్ని చర్చల్లోకి తీసుకొస్తారు కూడా.

రెండు వర్గాలు వేర్వేరు ర్యాలీలతో బలప్రదర్శన

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా రావడంతో సూర్యాపేటలో సమీకరణాలు మారినట్టు చెబుతున్నారు. రేవంత్‌ అనుచరుడు రమేష్‌రెడ్డి ఫుల్‌ జోష్‌లో ఉన్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్‌కే టికెట్‌ వస్తుందని ఆయన అనుచరులు ప్రచారం మొదలుపెట్టేశారు. అయితే కొత్త పీసీసీలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి కూడా సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. దీంతో ఇద్దరు నేతల మధ్య స్థానికంగా వర్గపోరు తారాస్థాయికి చేరినట్టు టాక్‌. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపిచ్చినా.. కలిసి నిర్వహించే పరిస్థితి లేదు. ఎవరి దారి వారిదే.. ఎవరి గుడారం వారిదే. దామోదర్‌రెడ్డికి పీసీసీలో పదవి దక్కడంతో ఆయన వర్గం సూర్యాపేటలో ర్యాలీ నిర్వహించింది. రేవంత్‌కు పీసీసీ చీఫ్ ఇచ్చారన్న పేరుతో రమేష్‌రెడ్డి వర్గం వేరేగా ప్రదర్శన చేపట్టింది. ఈ రెండు కార్యక్రమాలు పోటాపోటీగా చేపట్టడంతో బలప్రదర్శనకు దిగారా అన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయట.

సూర్యాపేట వదలుకొని పాలేరు వెళ్లాలని దామోదర్‌రెడ్డికి సూచన!

వచ్చే ఎన్నికల్లో సూర్యాపేట కాంగ్రెస్‌ టికెట్‌ తనదే అన్న ధీమాతో ఉన్నారు దామోదర్‌రెడ్డి. సూర్యాపేట కాంగ్రెస్‌లో ఎప్పటికీ తానే బాస్‌ అన్నది ఆయన మాట. అటు చూస్తే రమేష్‌రెడ్డికి రేవంత్‌ ఆశీసులు పూర్తిగా ఉన్నాయి. ఈ సమస్యను కొలిక్కి తెచ్చేందుకు రేవంత్‌ అండ్‌ కో దామోదర్‌రెడ్డికి మరో ప్రతిపాదన చేసిందని ప్రచారం జరుగుతోంది. దామోదర్‌రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి గెలిచారు. వెంకటరెడ్డి మరణంతో అక్కడ పార్టీకి నాయకత్వ లోటు ఉందని చెబుతున్నారు. అందుకే సూర్యాపేట వదిలిపెట్టి పాలేరు వెళ్లాలని దామోదర్‌రెడ్డికి సూచిస్తున్నట్టు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. ఆ ప్రతిపాదనకు దామోదర్‌రెడ్డి ఒప్పుకొంటారో లేదో కానీ.. ఇప్పటికైతే సూర్యాపేట కాంగ్రెస్‌లో రెండు వర్గాలు ఆధిపత్యం కోసం గట్టిగానే పోరాటం చేస్తున్నాయి. ఇటీవల గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి దామోదర్‌రెడ్డి బలవంతంగా వచ్చారని టాక్‌. సభలో కూడా ఆయన అంటీముట్టనట్టు ఉన్నారట. సూర్యాపేట పంచాయితీ వల్లే మాజీ మంత్రి అలా కనిపించారని గాంధీభవన్‌ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. మరి.. రానున్న రోజుల్లో సూర్యాపేట కాంగ్రెస్‌ ఎపిసోడ్‌లో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-