నిఖిల్ సిద్ధార్థ్‌… ‘హ్యాపీడేస్’ గోయింగ్ ఆన్!

(జూన్ 1 పుట్టిన రోజు సందర్భంగా)
చిత్రసీమలో గాడ్ ఫాదర్ లేకుండా దశాబ్దాల పాటు కొనసాగడం అంత ఈజీ కాదు. అయితే ప్రతిభాపాటవాలతో పాటు కొంత అదృష్టం ఉంటే అది పెద్ద కష్టమూ కాదు. నిఖిల్ సిద్ధార్థ్ లో ఆ రెండూ ఉన్నాయి. అందుకే అతని ‘హ్యాపీడేస్‌’ ఇంకా అలా కొనసాగుతూనే ఉన్నాయి. 2007లో విడుదలైన శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ కంటే ముందే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నిఖిల్ పోషించినా, పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం ఆ సినిమానే! ఆ తర్వాత ఇక నిఖిల్ వెనుదిరిగి చూసుకునే ఛాన్సే దక్కలేదు. అయితే… దానికి కేవలం అదృష్టం కారణమని చెప్పలేం. ఎందుకంటే ఈ పుష్కర కాలంలో అతన్ని పలు పరాజయాలూ పలకరించాయి. కానీ వాటికి వెరవకుండా ముందుకు సాగాడు. చిత్రసీమలోని స్నేహితుల సహకారంతో తిరిగి విజయపథంలోకి వచ్చాడు. ‘యువత’ సినిమాతో సోలో హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ కు అసలు సిసలు ఘనవిజయం 2013లో ‘స్వామి రారా’తో దక్కింది. ఆ తర్వాత వచ్చిన ‘కార్తికేయ’ మూవీ విడుదల సమయంలో బాలారిష్టాలను ఎదుర్కొన్నా… నిఖిల్ ఖాతాలో మరో గ్రాండ్ సక్సెస్ ను జమ చేసింది.

‘స్వామి రారా’ విజయం ఇచ్చిన స్ఫూర్తితో నిఖిల్ భిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ ప్రయోగాత్మక చిత్రాలు కమర్షియల్ గా ఎంతటి విజయాన్ని సాధించాయనే విషయాన్ని పక్కన పెడితే, అటు నటుడిగా నిఖిల్ కు, ఇటు ప్రేక్షకులకు చక్కని తృప్తినైతే ఇచ్చాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘సూర్య వర్సెస్ సూర్య’. ఈ మూవీతోనే సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నిఖిల్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఇక సుధీర్ వర్మ దర్శకత్వంలోనే నిఖిల్ నటించిన ‘కేశవ’ యాక్షన్ చిత్రాల అభిమానులను అలరించింది. మరోసారి నటుడిగా నిఖిల్ కు గుర్తింపును తెచ్చిపెట్టింది. కన్నడ రీమేక్ ‘కిర్రాక్ పార్టీ’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా…. మరో తమిళ రీమేక్ ‘అర్జున్ సురవరం’ నిఖిల్ లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను ఇంకోసారి వెలికి తీసింది.
విశేషం ఏమంటే… 34 సంవత్సరాల వయసులో నిఖిల్… డాక్టర్ పల్లవి వర్మను ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు. గత యేడాది మే 14న వీరి వివాహం నిరాడంబరంగా హైదరాబాద్ లో జరిగింది. బహుశా భార్య ప్రోత్సాహం వల్ల కావచ్చు ఇప్పుడు నితిన్ లైఫ్ స్టైల్ మారిపోయింది. అతనిలోని మానవతా వాది బయటకు వచ్చాడు. గత నెలా పదిహేను రోజులుగా నితిన్ కరోనా బాధితుల సేవలో తల మునకలై ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా, బ్లాక్ ఫంగస్ బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే… చందు మొండేటి దర్శకత్వంలోనే నిఖిల్ ఇప్పుడు ‘కార్తికేయ -2′ లో నటిస్తున్నాడు. అలానే ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, కథనం అందిస్తున్న ’18 పేజీస్’ మూవీలోనూ చేస్తున్నాడు. అనుపమా పరమేశ్వరన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. బన్నీ వాసు నిర్మాత. ఇది కాకుండా తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలోనూ ఓ సినిమాకు నిఖిల్ కమిట్ అయ్యాడు.

‘నేను లోకల్’ అని గర్వంగా చెప్పుకునే ఈ బేగం పేట బోయ్… హ్యాపీడేస్ మరిన్ని దశాబ్దాలపాటు కొనసాగాలని కోరుకుందాం…
హ్యాపీ బర్త్ డే నిఖిల్!!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-