కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం.. ఇక‌, పల్లె, పట్టణ ప్రగతి పనుల ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.. ఈ మ‌ధ్యే గాంధీ ఆస్ప‌త్రిని, వ‌రంగ‌ల్ ఎంజీఎంను సంద‌ర్శించి కోవిడ్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించి భ‌రోసా క‌ల్పించిన ఆయ‌న‌.. ఇప్పుడు మ‌రింత దూకుడు పెంచుతున్నారు.. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును.. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 19 వ తేదీ తర్వాత ఆకస్మికంగా త‌నిఖీలు నిర్వ‌హించ‌నున్నారు.. ఇక‌, ఇందులో భాగంగా.. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించడానికి ఈ నెల 13న అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల( డీపీవో) లతో సమావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు సీఎం.. మ‌రోవైపు.. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందని సిఎం తెలిపారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత.. మ‌రోసారి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడుతామ‌న్నారు. పచ్చదనాన్ని పెంచడానికి అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణను కొనసాగించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్.

ఇవాళ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తీరు, అందుకనుగుణంగా.. అదనపు కలెక్టర్లు, డీపీవోలు సహా మున్సిపల్, పంచాయతీ రాజ్ సిబ్బంది పనితీరు, చేపట్టవలసిన చర్యల పై ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం కేసీఆర్.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. నూతన పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ చట్టాలను అమల్లోకి తెచ్చి పల్లెలు, పట్టణాల అభివృద్దికి దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం సహకారం అందిస్తున్నద‌న్నారు.. గ్రామాలకు, మున్సిపాలిటీలకు ఆర్థికంగా అండదండలందిస్తూ ఉద్యోగుల భర్తీ చేపట్టి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నదన్నారు. ప్రతినెలా గ్రామాల అభివృద్ధికోసం, రూ. 339 కోట్లు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 148 కోట్ల రూపాయలను క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నదన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో కింది నుంచి పై స్థాయి వరకు సిబ్బందిని ప్రభుత్వం పూర్తి స్థాయిలో నియమించిందని సీఎం కేసీఆర్‌ గుర్తు చేసారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్పలితాలనిస్తున్నాయని, ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలు మిగిలే వున్నాయని సీఎం తెలిపారు. అయితే, నిర్దేశిత బాధ్యతలను నిర్వర్తించడంలో పంచాయతీ రాజ్ ఉద్యోగులు, అధికారులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో తెలుసుకోవాల్సివున్నదని అన్నారు. నిర్లక్ష్యంతో వ్యవహరించినట్టు తన పర్యటనలో గుర్తిస్తే.. ఎవరినీ క్షమించబోనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు గ్రామాలు, మున్సిపాలిటీలల్లో ఎంత వరకు ఏమేమి పనులు జరిగాయో ఓ చార్టును రూపొందించాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పల్లె ప్రగతి చార్టును, పట్టణ ప్రగతి చార్టును వేరు వేరుగా రూపొందించాలన్నారు.

గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతిలో భాగంగా…. పారిశుధ్యం, పచ్చదనం, మంచినీటి సరఫరా, రోజువారీ పరిశుభ్రత, మొక్కల స్థితి, మొక్కలు బతికిన శాతం, గ్రామసభలు నిర్వహించిన తీరు, స్థానిక ఎంపీవోలు పాల్గొన్నతీరు, అందులో వారు గ్రామ ప్రగతి కోసం తీసుకున్న చర్యలు, ఎన్నిసార్లు గ్రామ సభలు నిర్వహించారు, గ్రామ ప్రగతి నివేదికల మీద జరిగిన చర్చల సారాంశం వంటి అంశాలను చార్టులో పొందుపరచాలన్నారు సీఎం కేసీఆర్.. ఇక‌, అన్ని రకాల అంశాలను పొందుపరిచి వాటిల్లో జరుగుతున్న పురోగతినే కాకుండా వెనుబాటు ను కూడా చార్టు రూపంలో సిద్దం చేయాలని మంచి చెడులను రెండింటిని ప్రాతిపదికగా తీసుకుని చార్టును తయారు చేసి, ఆకస్మిక తనిఖీ పర్యటనలో తనకు అందచేయాలని సిఎస్ ను ఆదేశించారు. సీజనల్ వ్యాధులను ముందస్తుగానే అరికట్టేందుకు గ్రామాల్లో ఇకనుంచి సీజన్ వారీగా చార్ట్ తయారు చేయాలని సిఎం అధికారులకు సూచించారు. మ‌రోవైపు.. కరోనా తగ్గుముఖం పట్టిందనీ,. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక్క శాతానికి పాజిటివీ రేటు చేరకున్నదని అధికారులు వివరించారు సీఎం… రాష్ట్రంలో నేడు పాజిటివిటీ రేటు కేవలం 4.7 శాతం మాత్రంగానే నమోదయ్యిందని,. ప్రభుత్వ దవాఖానాల్లో బెడ్లన్నీ ఎక్కువ శాతం ఖాళీగా వున్నాయని సీఎంకు వారు తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-