అంతా వైఎస్‌ మయం, వివాదాలకు దాదాపు దూరం- విజయమ్మ ‘నాలో నాతో  ’

 అంతా వైఎస్‌ మయం, వివాదాలకు దాదాపు దూరం- విజయమ్మ ‘నాలో నాతో  ’

తెలకపల్లి రవి 


         ‘నాలో నాతో వైఎస్ఆర్‌ అన్నపేరుతో ఆయన సతీమణి విజయమ్మ రాసిన పుస్తకం ఒక  ప్రత్యేక తరహాకు చెందుతుందని చెప్పాలి. ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఒక కుటుంబం (ఇప్పటికైతే ఆ ఒక్కటే) అంతర్గత దృశ్యం ఇది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి భార్యగా, జగన్మోహన్‌రెడ్డి మాతృమూర్తిగా ఆ ఇద్దరి జయాపజయాల్లో పాత్ర వహించిన విజయమ్మ తెలుగువారికి సుపరిచితురాలు . వైఎస్ఆర్‌ అంటే ఒక సారుగా ఎలా.. జీవితంలోనూ కుటుంబంలోనూ మార్గదర్శిగా నిలిచారో ఆమె ప్రేమతో ఈ పుస్తకం అక్షరీకరించారు. దశాబ్దాల పాటు రాజకీయాల‌తో ముడిప‌డిన కుటుంబమైనా ఆమె ప్రధానంగా పెద్దులు పిల్లల తోబుట్టువు గురించిన సంగతులను రేఖామాత్రంగా పరిచయం చేయడంపై దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా బహుముఖసేవలందించిన వైఎస్‌.. ఈవ విస్త్రత కుటుంబంలోనూ ఎంత బాధ్యతగా మెలిగారో బంధాలను గౌరవించారో  సోదాహరణంగా చెప్పారు. ఆ విధంగా చూస్తే ఇది కేవలం రాజకీయ ప్రధానమైన పుస్తకం కాదు, కుటుంబ జీవిత దర్పణం. ఒక్క రూపాయి ఫీజుతో సేవలందించే డాక్టర్‌గా మొదలైన వైఎస్‌ ప్రజాజీవితం ఉన్నత శిఖరాలు చేరడానికి ఆయన తండ్రి రాజారెడ్డి  తోడ్పాటు, అలాగే జగన్‌ యువకుడుగా వున్ననాటి నుంచి విషయాలు చర్చిస్తూ బాధ్యతులు అప్పగిస్తూ వైఎస్‌ తీర్చిదిద్దిన తీరు కూడా చెప్పారు. అసంఖ్యాకమైన వర్ణచిత్రాల‌తో నిండిన ఈ పెద్దసైజు పుస్తకంలో వివిధ కోణాలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కానీ, కొన్ని ముఖ్యాంశాలుగా చూడాంటే.

ప్రతిపేజీ రాజశేఖరమయం. ఆయన మాటులు అలవాట్లు, యువసాహసాలు పెద్దరికపు సలహాలు, కుటుంబంలో మహిళను ప్రోత్సహించడం చదివించడం ఒడుదుడుకుల్లో తోడుగావుండటం. కుమార్తె షర్మిల పై ఆయన ప్రత్యేకాభిమానం, కూతురు కోసం సిగరెట్లు మానేయడం వంటి విషయాలు , ఆమెతోఅన్నీ చర్చించడం, షర్మిల ఇష్టానికి వ్యతిరేకంగా చేసిన మొదటి పెళ్లి ఫలించలేదనే వాస్తవాలు  గ్రహించి ఆమె కోరుకున్నఅనిల్‌తోపెళ్లి చేయడం వంటివి వివరంగానే రాశారు. షర్మిల  గురించి ఎక్కువరాశారని వ్యాఖ్యలు  వచ్చినా కొన్ని కారణాలు కనిపిస్తాయి. తండ్రితో ఆమెతో వున్న ప్రత్యేకానుబంధం, జగన్‌ ఇప్పటికే ఉన్నతస్థానానికి చేరుకోవడం అంతగా తెలియని తన  కుమార్తె  జీవితం గురించి చెప్పాని తల్లిగా భావించడం కావచ్చు..

జగన్‌ పెళ్లి ప్రత్యేకించి కోడులు భారతి పాత్ర, దక్షత.

వైఎస్‌ సన్నిహితులైన కెవిపి రామచంద్రరావు (క్యాప్‌స్టన్‌) వివేకానంద రెడ్డి (వివేకమన్న) ప్రస్తావను.

క్రైస్తవ విశ్వాసాతో సాగిన జీవిత సరళి.

అంచెలంచెలుగా  వైఎస్ ‌ఎదుగుదల ఎదుర్కొన్న ఆటుపోట్లు, అపూర్వమైన ప్రజా స్థానం.

ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలు.

జగన్‌ సాక్షి స్థాపన, ఎంపీగా ఎన్నిక.

రెండవసారి హెలికాప్టర్‌ ప్రమాదంలో విషాదమరణం, ఆ ప్రమాదంపై పలు అనుమానాలు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏమీ చేయకున్నా అధిష్టానం ప్రతికూల వైఖరి.

జగన్‌పై కేసు, అరెస్టులు, ఉప ఎన్నికల షర్మిలతో కసి చేసిన పాదయాత్ర, 2014లో ఆశించినట్టు అధికారంలోకి రాలేక పోయినా 2019లో ఘన విజయం.

              ఇవన్నీ తెలిసిన విషయాలుగా కనిపించినా  ఆసమయంలో తమ ఆలోచనలు, అనుభవాలు , కష్టసుఖలు  ప్రత్యక్షంగా ఆమె మాటల్లో వింటాం. అయితే యథాలాపంగా తప్ప ఎవరి గురించి లేదా ఏ పరిణామం గురించి పని గట్టుకుని తీవ్ర భాషలో లేదా రాజకీయ వ్యతిరేకత గుప్పించేలా రాయకపోవడం విశేషం.  అంత లోతుల్లోకి వెళ్లరాదని నియమం పెట్టుకున్నారనుకోవచ్చు. లేకుంటే ఈ పుస్తకం తీరు మరోలా వుండేది.

రోశయ్యను సీఎల్పీ నాయకుడుగా జగన్‌ ప్రతిపాదించిన ఫొటో వేయడం విశేషమైతే ముఖ్యమంత్రులతో సహా కొంతమంది పేర్లు అసలు కనిపించవు. జగన్ జైలులో వున్నప్పుడు శాసనసభకు ఎన్నికై వచ్చిన విజయమ్మ.. ఆ 16 నెలలు అనుభవాలు కూడా చెప్పలేదంటే కారణం వైఎస్‌ పైనే కేంద్రీకరణ వుందానుకోవడమే.

మొత్తంపైన అత్యంత ప్రజాదరణపొందిన ముఖ్యమంత్రులలో ప్రథమ శ్రేణిలో స్థానంపొందిన వైఎస్‌ తొలి జీవితం గురించి తెలుసుకోవడానికి వారి కుటుంబ వ్యవస్థ గురించి నాలో.. నాతో.. పుస్తకం విజయమ్మ కళ్లతో చూపిస్తుంది. ఈపుస్తకంలో విషయాన్నీ ఆమె చెప్పినవే అయినా కొంత సహకరించిన మిత్రులు ఫ్యామిలీ ఫీచర్స్‌ చూసే వారు కావడం వల్లనే కావచ్చు ప్రధానంగా ఫ్యామిలీ స్టోరీలాగా నడిపించారు.

రాజకీయ వివాదాలు విమర్శ‌లు ఎలాగూ వుంటాయి . ఆ  రాజకీయాంశాలు వైరుధ్యాలు పరిణామాలు మాలాంటి రచయితులు ఎలాగూ రాస్తారు. రాజకీయ సామాజిక జీవితంలో నాయక పాత్ర వహించిన వారి ఇతర పార్శ్యాలు తొలుసుకోవడానికి దోహదం చేసే ఒక సానుకూల  గ్రంధంగా దీన్ని పరిగణించవచ్చు. ఒక  కుటుంబ మహిళగానే గాక  సమాజ  రాజకీయాలోనూ ప్రభావశీల పాత్ర వహించినవిజయమ్మ వాటిని పుస్తకంగానూ అందించడం అభినందనీయం. ప్రముఖ కుటుంబాల నుంచి ఉద్యమాల నుంచి వచ్చిన ఇతర మహిళా నేత‌లు కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం.