వాచీ లేదు కానీ.... వేల కోట్లున్నాయి

వాచీ లేదు కానీ.... వేల కోట్లున్నాయి

"చంద్రబాబుకు చేతికి గడియారం ఉండదు, మెడలో గొలుసు ఉండదు" కానీ వేల కోట్ల ఆస్తులు ఉంటాయని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. 2ఎకరాల నుంచి 4 వేల కోట్లు ఆస్తి చంద్రబాబు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు. పాదయాత్రలో భాగంగా తణుకు నరేంద్ర సెంటర్లో బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. నోట్ల రద్దుకు 2 రోజుల ముందు హెరిటేజ్ షేర్లు ఫ్యూచర్ గ్రూపునకు ఎలా అమ్మేశారని ప్రశ్నించారు. వేల కోట్ల విలువ చేసే హెరిటేజ్ ఆస్తుల సంపాదన సక్రమమైనదేనా అని నిలదీశారు. తెలంగాణా, ఏపీల్లో ఎమ్మెల్యేలను కొనడానికి చంద్రబాబు దగ్గర డబ్బులు ఉంటాయి కానీ సంక్షేమానికి మాత్రం ఉండవని ఆరోపించారు.  

చంద్రబాబుకు మందు అలవాటు లేదు, కానీ ప్రతీ గ్రామంలో బెల్టు షాపు మాత్రం తప్పనిసరిగా ఉంటుందని ఎద్దేవ చేశారు. "ఏపీ సీఎం ఏ అమ్మాయిల వంక చూడరు". మరోవైపు మహిళలపై  అఘాయిత్యాలు జరుగుతున్న కూడా ఆయన పట్టించుకోరని జగన్ విమర్శించారు. చంద్రబాబు "చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి మాత్రం తప్పుడు పనుల"ని విమర్శించారు. టీడీపీ నాయకుల దౌర్జన్యంపై కేసులు కడితే పోలీసులను వి.ఆర్.కు పంపుతున్నారు. తణుకు ఎమ్మెల్యేకు ఇసుక మాఫియా లక్షలకు లక్షలు నెల నెలా వాటాలు అందిస్తున్నారని ఆరోపించారు. 
 
సాగునీరు అందక పశ్చిమ గోదావరి రైతులు నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. పండిన పంటకు ఇక్కడి నాయకులు ఐకేపీ ధాన్యం కొనుగోళ్లలోనూ రైతుల సొమ్ములు కాజేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తాగునీరు కూడా కొనుక్కునే దుస్థితి ఏర్పడిందని తెలిపారు.  వైసీపీ అధికారంలోకి రాగానే 65 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో చంద్రబాబు, ఆయన కొడుకు, మంత్రులు మొత్తం తినేస్తున్నారని విమర్శించారు. లక్షల మంది బాధితులు ఉంటే అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ తెలిపారు. ఢిల్లీ వెళ్లి ఎస్.ఎల్. గ్రూపును పిలిపించుకుని అర్ధరాత్రి చర్చలు జరిపారని తెలిపారు. రూ.1100 కోట్లు ప్రభుత్వం కడితే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని తాము ముందే చెప్పామన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే బడ్జెట్ లో రూ.1100 కోట్లు కేటాయించి, 80 శాతం మందికి న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.