చినబాబు నుంచి పెదబాబు దాకా.. అంతా అవినీతే

చినబాబు నుంచి పెదబాబు దాకా.. అంతా అవినీతే

రాష్ట్రంలో కలెక్టర్ నుంచి ఎమ్మెల్యే దాకా.. చినబాబు నుంచి పెదబాబు దాకా అంతా అవినీతి అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడారు. నాటక, సినీ, కళారంగానికి పాలకొల్లు ప్రసిద్ధి చెందిందని.. అల్లు రామలింగయ్య, దాసరి, చిరంజీవి, కోడి రామకృష్ణ లాంటి మహానీయులు పాలకొల్లు వారేనని అన్నారు. వ్యవసాయం పండుగగా జరగాల్సిన చోట దండుగ మార్చిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని జగన్ ఆరోపించారు. ఈ డెల్టాలో నీరు లేక పంటలు ఎండుతున్నాయని.. రైస్ మిల్లు మూత పడుతున్నాయని.. కానీ టీడీపీ నేతల దోపిడి మాత్రం సిరుల పంట పండిస్తోందన్నారు.

ఈ జిల్లాలో మట్టి, నీరు, ఇసుక, కొల్లేరు ఆఖరికి వనం-మనంలలో కూడా అవినీతి జరుగుతోందని.. చంద్రబాబు ఇచ్చిన ట్రైనింగ్‌ని ఇక్కడి నేతలు బాగా వంటబట్టించుకున్నారని వైసీపీ అధినేత ఆరోపించారు. రైతులు వ్యవసాయం చేయడానికి నీరు లేక రొయ్యలు, చేపల చెరువుల వైపు మళ్లీపోతున్నారని.. దివంగత నేత వైఎస్ తలపెట్టిన డెల్టా ఆధునీకీకరణ పనులను పట్టించుకునే వారే లేరన్నారు. పట్టణంలో తాగడానికి కనీసం మంచినీళ్లు లేవని.. నీళ్ల కోసం జనం యుద్ధాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో పేదలకు ఇచ్చిన భూములను చంద్రబాబు వెనక్కు తీసుకుని.. ఫ్లాట్లు కట్టిస్తామని వేల రూపాయలు గుంజుతున్నారని.. అంటే 20 ఏళ్లపాటు పేద ప్రజలు ఇళ్లకోసం డబ్బులు కట్టి బాబు గారి జేబు నింపాలా అని జగన్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్లాట్లకు కట్టిన డబ్బులన్నీ మాఫీ చేస్తామన్నారు.. 

కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మొద్దని.. ఒకరు రాష్ట్రాన్ని విడగొట్టారని.. మరొకరు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలిపించాలని చంద్రబాబు కోరుతున్నారని.. ఆ పార్టీని నమ్మొద్దని ఇప్పుడు 17 మంది ఎంపీలు ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. 25కి 25 మంది ఎంపీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అందించాలని జగన్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదా సాధించి తీసుకొస్తామని.. హోదా ఇస్తేనే కేంద్రానికి మద్ధతు ఇస్తామన్నారు. ఈ క్రమంలో జగన్ హామీల వర్షం కురిపించారు. ప్రతీ పరిశ్రమలో 75 శాతం రిజర్వేషన్లు స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని..  ప్రతీ గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌లు ఏర్పాటు చేసి.. ఆ గ్రామంలోని 10 మందికి ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు.