సోనూసూద్ నుంచి ట్రాక్టర్ తీసుకున్న రైతు చుట్టూ ఏపీ రాజకీయాలు.!

సోనూసూద్ నుంచి ట్రాక్టర్ తీసుకున్న రైతు చుట్టూ ఏపీ రాజకీయాలు.!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోను.. సోషల్‌ మీడియాలోనూ ఓ ట్రాక్టర్ చూట్టునే చర్చలు నడుస్తున్నాయి. మేము ఇచ్చుంటే బాగుటుందని ఒకరు.. కాదు కాదు మేము ఇచ్చుంటే ఇంకా బాగుండునని ఇంకొకరు చర్చించుకుంటున్నారు. అసలు మీకేంటి సంబంధం అని సోషల్‌ మీడియా నేతలను ఆడేసుకుంటోంది. ఇంతకీ ఆ ట్రాక్టర్‌ కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

కాడెద్దులుగా కుమార్తెల ఫొటోలు వైరల్‌!

నాగేశ్వరరావు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన మానవహక్కల సంఘం నేత. రైతు కూడా.  ఓ టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగించేవారు. కరోనా దెబ్బకు జీవితం తలకిందులు కావడంతో.. కుటుంబంతో కలిసి సొంతూరైన పీలేరుకు వచ్చేశారు. తన రెండెకరాల పొలంలో వేరుశనగ, టమోట పంట వేయడానికి సిద్ధమయ్యారు. కరోనాతో చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడంతో.. పొలాన్ని కొంత ట్రాక్టర్‌తో దున్నించారు. మిగిలిన పొలాన్ని తన కుమార్తెలను కాడెద్దులగా మార్చి దున్నేశారు. కుమార్తెలు కాడెద్దులుగా ఉన్న వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

గంటల వ్యవధిలోనే ట్రాక్టర్‌ అందజేసిన సోనూ సూద్‌!

ఈ దృశ్యాలు నటుడు సోనూసూద్‌ కంట పడ్డాయి. వారికి సాయం చేయాలని భావించి తొలుత ఎద్దులు పంపుతానని అన్నారు. తర్వాత కుటుంబ సభ్యుల విన్నపం మేరకు ట్రాక్టర్‌ ఇస్తున్నట్లు ట్వీట్‌ చేసి.. గంటల వ్యవధిలోనే రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ అందజేశారు. ఏం జరిగిందో అధికార, ప్రతిపక్ష పార్టీలు తెలుసుకునే లోపుగానే ఈ సాయానికి పబ్లిసీటీ వచ్చేసింది. 

రైతుకు ప్రభుత్వ సాయం అందడం లేదని టీడీపీ శ్రేణుల పోస్ట్‌లు!

ఆ రైతు పిల్లల చదువుకయ్యే ఖర్చు చెల్లిస్తానని చంద్రబాబు ప్రకటించారు. అటు సోనూ సూద్‌, ఇటు చంద్రబాబు ట్వీట్లతో ఈ వార్తకు ఒక్కసారిగా మైలేజ్‌  పెరిగిపోయింది. ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు ఎంటరై  రైతు నాగేశ్వరరావుకు ప్రభుత్వ పథకాల సాయం అందలేదని పోస్ట్‌ల మీద పోస్టులు పెట్టేశాయి. దీంతో వైసీపీ సోషల్‌ మీడియా వింగ్‌  అలర్ట్‌ అయ్యింది. అసలు ఈ నాగేశ్వరరావు ఎవరు అనేది ఆరా తీసింది. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా నాగేశ్వరరావు గురించి సమాచారం ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని అడిగినట్లు సమాచారం. 

గత ఏడాది రూ.13,500 రైతు భరోసా సాయం

రైతుగా నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నివిధాలుగా లబ్ధి పొందినట్లు గుర్తించారు.  రైతు భరోసా కింద గత ఏడాది  13 వేల 500 అందుకున్నారని.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 7 వేల 500 తీసుకున్నారని తెలుసుకున్నారు. చిన్నకుమార్తెకు  అమ్మఒడి కింద జనవరిలో 15వేలు, నాగేశ్వరరావు తల్లిదండ్రులు వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నట్లు గుర్తించారు. కరోనా సమయంలో పేద కుటుంబాలను ఆదుకునే పథకం కింద  వెయ్యి రూపాయలు, రెండెకరాల పొలంలో వేరుశనగ వేయడానికి  రైతు భరోసా కేంద్రం నుంచి DAP ఎరువు, విత్తనాలు పొందినట్లు సోషల్‌ మీడియా ద్వారా బయటపెట్టారు. 

2009లో లోక్‌సత్తా పార్టీ తరుఫున ఎన్నికల్లో పోటీ!

2009లో లోక్‌సత్తా పార్టీ తరఫున పోటీ చేశారు నాగేశ్వరరావు. దీంతో ఇన్ని పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ ఎందుకని ఓ వర్గం.. ఎందుకు అడ్డుకుంటారని మరో వర్గం సోషల్‌ మీడియాలో యుద్ధం మొదలుపెట్టాయి. ట్రాక్టర్‌ రానంత వరకూ సైలెంట్‌గా ఉన్నవారు ఒక్కసారిగా విమర్శల వేడి పెంచడానికి చంద్రబాబే కారణమనే టాక్‌ నడుస్తోంది. సోనూ సూద్‌ ట్వీట్‌ చేసిన వెంటనే కాకుండా.. ఆ రైతుకు ట్రాక్టర్‌ వచ్చిన తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకుని.. వారి పిల్లలను చదవిస్తానని చెప్పడం.. సోనూ సూద్‌తో ఫోన్‌లో మాట్లాడటం లాంటివి అధికార పార్టీలో చర్చకు దారితీసిందట. అసలు ఆ రైతుకు ప్రభుత్వం ఏమీ చేయలేదని టీడీపీ నేతలు రెచ్చగొట్టడంతో వైసీపీ సీరియస్‌గా తీసుకుని నాగేశ్వరరావు గురించి ఆరా తీసి మొత్తం బయటపెట్టేసింది. అధికారులు సైతం ప్రభుత్వానికి ఓ నివేదిక పంపారట. 

ట్రాక్టర్‌ వెనక్కి ఇవ్వబోనంటున్న రైతు నాగేశ్వరరావు!

ట్రాక్టర్‌ను వెనక్కి ఇచ్చేస్తానని నాగేశ్వరరావు చెప్పినట్లుగా MDO పేరుమీద వచ్చిన వార్తను అస్త్రంగా చేసుకుని ఇప్పుడు మరిన్ని ట్రోల్స్‌ మొదలయ్యాయి. రైతు నాగేశ్వరరావు మాత్రం తాను ట్రాక్టర్‌ వెనక్కి ఇవ్వడం లేదని చెబుతున్నారు. మొత్తానికి టీడీపీ నేతల అత్యుత్సాహం ఆ రైతుకు ట్రాక్టర్‌ దక్కకుండా ఎసరు పెట్టేలా ఉందన్న  చర్చ మొదలైంది.