వైసీపీలో ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరో ?

వైసీపీలో ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరో ?

ఏపీ మంత్రి మండలిలో మరో ఏడాదిన్నర దాకా  మార్పులు, చేర్పులు ఉండవనుకుంటున్న తరుణంలో ఆశావహులకు అనుకోని అవకాశం వచ్చినట్లయింది. ఇద్దరు శాసన మండలి సభ్యులు(పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ) రాజ్యసభకు ఎన్నిక కావటంతో క్యాబినెట్‌ బెర్తుల్లో రెండు ఖాళీ అవుతున్నాయి. ఈ ఇద్దరూ బీసీ వర్గాలకు చెందిన వారు కావటంతో తిరిగి బీసీలతో ఆ స్థానాలు భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత. ఉభయ గోదావరి జిల్లాలో ఈ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. ఆయన రాజ్యసభకు వెళ్ళటంతో క్యాబినెట్‌లో ఈ సామాజిక వర్గ ప్రాతినిధ్యం ఇప్పుడు లేకుండా పోతుంది. ఇదే సామాజిక వర్గం నుంచి రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు ఉన్నారు. మోపిదేవి స్థానంలో మత్స్యకార వర్గానికి ఇవ్వాలనుకుంటే ఇదే జిల్లా నుంచి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ పేరు పరిశీలనలో ఉంటుంది అని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అయితే రాజమండ్రి లోక్‌సభ నుంచి శెట్టి బలిజ వర్గానికి చెందిన మార్గాని భరత్‌ ఉన్నారు. పైగా కరోనా వల్ల వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించి పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ స్థానాన్ని శెట్టి బలిజలకు ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచే అవకాశం ఉంది. అలా గోదావరి జిల్లాల్లో మూడు కీలక పదవులు లోక్‌సభ, రాజ్యసభ, జిల్లా జడ్పీ ఈ వర్గానికి ఇచ్చినట్లు అవుతుంది కనుక ఆ పదవిని బీసీల్లోనే ఇతర వర్గాలకు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మోపిదేవి జిల్లా అయినా గుంటూరులో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిలో ప్రస్తుతానికి ముందంజలో చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ ఒక్కరే కన్పిస్తున్నారు. అయితే ఆమెను మంత్రి వర్గంలోకి తీసుకుంటే సదరు నియోజకవర్గంలో లేనిపోని తలనొప్పులు ఎదురయ్యే ప్రమాదం కన్పిస్తోందనేది చర్చ. 

ఎందుకంటే చిలకలూరి పేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకుంటాననే హామీ గతంలోనే జగన్‌ నుంచి లభించింది. అయితే మండలి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్న క్రమంలో మర్రి రాజశేఖర్‌ ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. ఈ చర్చలు ఇలా ఉంటే పార్టీలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు మరో ఈక్వేషన్‌ను కూడా తెర మీదకు తెస్తున్నారు. బీసీ కాకుండా వేరే వర్గాలను పరిగణలోకి తీసుకునే పనయితే బ్రాహ్మణ వర్గాలకు మంత్రి మండలిలో ప్రాతినిధ్యం లేదు. అయితే ఈ వర్గం నుంచి డిప్యూటీ స్పీకర్‌ ఉన్నా మంత్రి పదవి కోసం మల్లాది లాంటి వారు పోటీ పడే అవకాశం ఉంది. అయితే మనం ఎన్ని లెక్కలు వేసుకున్నా  ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరో తేలాలంటే మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.