కేంద్రమంత్రులతో వైసీపీ ఎంపీ బాలశౌరి వరుస భేటీలు

కేంద్రమంత్రులతో వైసీపీ ఎంపీ బాలశౌరి వరుస భేటీలు

వైసీపీ ఎంపీ బాలశౌరి ఢిల్లీలో కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో అరగంట భేటీ అయిన బాలశౌరి రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో 20నిముషాలు చర్చించారు..నిన్న సాయంత్రం లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిశారు బాలశౌరి. రఘురామ కృష్ణంరాజు వ్యవహారం తెర మీద ఉండడంతో ఆయన ఈ విషయం మీదనే చర్చించినట్లు చెబుతున్నారు.

గత వారం లోక్ సభ స్పీకర్ రాజ్ నాథ్ సింగ్, కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లాను కలిశారు రఘురామ కృష్ణంరాజు. అయితే ఈ వరుస భేటీల విషయం మీద బాలశౌరిని ఎన్టీవీ సంప్రదించగా రఘురామకృష్ణ రాజు వ్యవహారం పై ఎవరితోనూ చర్చించలేదని అన్నారు. నాగాయలంకలో 3 వేల కోట్ల మిసైల్ లాంచింగ్ ప్రాజెక్టు ఏర్పాటు కు కేంద్రం ఆమోదించిన నేపధ్యంలో, కృతజ్ఞతలు తెలిపేందుకే రక్షణ శాఖ మంత్రి ని కలిశానని బాలశౌరి తెలిపారు.

బొగ్గు శాఖ మంత్రి గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ని కలిసి ‘ఏపి జెన్కో’ కు డెడికేటెడ్ “కోల్ బ్లాకులు” ( బొగ్గు గనులు) కేటాయుంచాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.  ఇక, కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి సదానంద గౌడ్ ను కలిసి మచిలీపట్నం లో “ఫర్మాసిటీ” ని ఏర్పాటు చేయాలని కోరినట్లు బాలశౌరి తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎప్పటి నుంచి ప్రారంభమౌతాయో తెలుకొనేందుకే నిన్న లోకసభ స్పీకరు ఓం బిర్లా ను కలిశానని బాలశౌరి అన్నారు.

అంతకు మించి నా భేటీలకు రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని ఆయన అన్నారు. అయితే, ఒకే రోజు బాలశౌరి ముగ్గురు కేంద్ర మంత్రులను కలవడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. రఘురామకృష్ణ రాజు వ్యవహారం చర్చించలేదని బాలశౌరి అంటున్నప్పటికీ, ఖచ్చితంగా ఆ పని మీదే ఆయన ఢిల్లీకి వచ్చినట్లు సమాచారం. రఘరామకృష్ణ రాజు కు షోకాజ్ నోటీసు ఇవ్వడానికి దారితీసిన పరిస్థితులు, పూర్వాపరాలకు సంబంధించిన వివరాలను, డాక్యుమెంట్లను కూడా కేంద్ర మంత్రులకు బాలశౌరి అందజేసినట్లు సమాచారం.