తిరుపతిలో షియోమీ టీవీల తయారీ

తిరుపతిలో షియోమీ టీవీల తయారీ

భారత మొబైల్ మార్కెట్ లో నెంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తున్న చైనా అగ్రగామి మొబైల్ హ్యండ్ సెట్స్ సంస్థ.. షియోమీ ఇక టీవీల మార్కెట్లోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. దేశీయ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్ భాగస్వామ్యంలో నెలకు 55 వేల టీవీలు తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొంది. మేకిన్ ఇండియాలో భాగంగా తిరుపతిలో డిక్సన్ ఏర్పాటు చేసిన కొత్త ప్లాంటులో ఈ ఎంఐ బ్రాండ్ టీవీలు తయారుచేస్తారు. ఆగస్టులో షియోమీ తన ఎంఐ బ్రాండ్ టెలివిజన్లు ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా దేశీయంగానే వీటిని తయారు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వచ్చే నెల నుంచి తిరుపతిలోని డిక్సన్ కొత్త ప్లాంటులో టీవీల ఉత్పత్తి ప్రారంభించనున్నట్టు రెండు కంపెనీల ప్రతినిధులు ప్రకటించారు. మొదట 32, 43 అంగుళాల టీవీల తయారీతో ప్రారంభించి తర్వాత కొత్త మోడళ్లను విస్తరించనున్నట్టు షియోమీ, డిక్సన్ కంపెనీల అధికార వర్గాలు తెలిపాయి. 

షియోమీ ఇప్పటికే తైవాన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ తో టీవీల తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద 55 అంగుళాల షియోమీ టీవీలను చెన్నైలో తయారు చేయనున్నారు. అయితే భారత్ లో అమ్మబోయే 90% టెలివిజన్ సెట్లు తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్న షియోమీ స్థానికంగానే ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు షియోమీ సంస్థ 20% దిగుమతి పన్ను, అదనంగా 2% సర్ ఛార్జి చెల్లిస్తోంది. వీటికి తోడు టెలివిజన్ సెట్లపై 28% జీఎస్టీ కట్టాల్సి వస్తోంది. తాజా ఒప్పందంతో కేవలం 5% దిగుమతి సుంకం, 1% అదనపు సర్ ఛార్జి చెల్లిస్తే సరిపోతుంది.