ఎమ్మెల్సీ జగదీష్‌ టీడీపీకి గుడ్‌బై చెప్పబోతున్నారా?

ఎమ్మెల్సీ జగదీష్‌ టీడీపీకి గుడ్‌బై చెప్పబోతున్నారా?

విజయనగరం టీడీపీ కోట బీటలు వారుతోందా? జిల్లాలో కీలక నేత కండువా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నారా? అధికార పార్టీ వేసిన స్కెచ్‌ ఏంటి? చర్చకు కేంద్రమైన నాయకుడు ఎవరు? 

2019లో టీడీపీకి ఒక్క సీటూ రాలేదు!

టీడీపీకి ఒకప్పుడు విజయనగరం జిల్లా కంచుకోటగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఆరు అసెంబ్లీ, ఎంపీ స్థానం గెలుచుకున్న తెలుగుదేశం 2019 ఎన్నికల్లో ఒక్క సీటు సాధించలేదు. అధికారానికి దూరం కావడం ఒక బాధ అయితే.. సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజును వైసీపీ లక్ష్యంగా చేసుకోవడం.. మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు చుట్టపు చూపుగా వచ్చివెళ్లడం వల్ల జిల్లాలో టీడీపీ మూడు గ్రూపులుగా.. ఆరు వర్గాలుగా మారిపోయింది. 

టీడీపీ ఎమ్మెల్సీ జగదీష్‌ జంప్‌ చేస్తున్నారా?

ఏ మాత్రం యాక్టివ్‌గా ఉన్నా.. వైసీపీ ఫోకస్‌ పెడుతుండటంతో టీడీపీలో కీలక నేతలుగా చెప్పుకొన్నవారంతా సైలెంట్‌ అయిపోయారట. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ  ద్వారపురెడ్డి జగదీష్‌ వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జోరందుకుంది.  జగదీష్‌ మూడుసార్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ఇంకా ఏడాది ఉంది. ఒకవేళ లోక్‌సభ ప్రాతిపదికగా జిల్లాల విభజన జరిగితే  పార్వతీపురానికి చెందిన జగదీష్‌కు విజయనగరంతో సంబంధాలు తెగిపోతాయి. పార్వతీపురం అరకులోకి వెళ్లే అవకాశం ఉంటుంది.  వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఆయన.. రాజకీయ భవిష్యత్‌ ప్రమాదంలో పడకుండా పావులు కదుపుతున్నట్లు  సమాచారం. 

గతంలోనే వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారా? 

గతంలోనే జగదీష్‌ YCP గూటికి చేరాలని ప్రయత్నించినా.. పార్వతీపురం YCP ఎమ్మెల్యే జోగారావు అడ్డుచెప్పినట్లు చెబుతున్నారు. తాజాగా జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతల అండతో అధికారపార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  జగదీష్‌ భార్య ద్వారపురెడ్డి శ్రీదేవి మొన్నటి వరకూ పార్వతీపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అందువల్ల భవిష్యత్‌లో భార్యాభర్తల్లో ఒకరికి పదవి ఇస్తామని వైసీపీ జిల్లా పెద్దలు హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్వతీపురానికి చెందిన వైసీపీ నేతలు సైతం టీడీపీ ఎమ్మెల్సీ పార్టీ మారడం ఖాయమని అంటున్నారట. 
ఈ ప్రచారంపై జగదీష్‌ ఎక్కడా పెదవి విప్పడం లేదు. అవునని కానీ.. కాదని కానీ చెప్పడం లేదు. మరి.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీ కండువా మార్చేస్తారో.. లేక అశోక్‌ గజపతి రాజు వీరవిధేయుడిగా మరోసారి విజయనగరం జిల్లా టీడీపీ పగ్గాలు చేపడతారో చూడాలి.