ఎన్ని చెబుతున్నా మీరు మారరా ?

ఎన్ని చెబుతున్నా మీరు మారరా ?


కరోనా  రూపంలో మృత్యువు తరుముతోంది. జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.అయినా మారడం లేదు. లాక్ డౌన్ అంటున్నా.. పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్నారు. కళ్లముందే ఇటలీలో మారణహోమం జరుగుతున్నా.. జనం ఎందుకిలా చేస్తున్నారు. వీరు మారరా? బతుకుపై ఆశలేదా.. మనకేం కాదులే అన్న తెగింపా.. అసలు ఏం చేస్తున్నారు?

ప్రభుత్వం హెచ్చరించినా ... ఇటలీ జనం పట్టించుకోలేదు. ఓ వైపు కరోనా విజృంభిస్తున్నా.. మనకేం కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరించారు.ప్రభుత్వం కళ్లుగప్పి జల్సా చేశారు.చివరికు మృత్యువు విరుచుకుపడింది. పిట్టల్లా జనం నేలరాలుతున్నారు. క్వారంటైన్ వార్డులు లేవు. సరిపడా బెడ్లు లేవు. చికిత్స చేసేందుకు సరిపడినంతమంది సిబ్బంది లేరు. ఎంతటి విషాదం.. ఎంతటి దయనీయం.. నిర్లక్ష్యానికి ఎలాంటి దారుణ ఫలితముంటుందో ఇటలీ వాసుల దుస్థితి మనకు కళ్లకు కడుతోంది.

ఇప్పుడు ఇటలీవాసుల్లాగే తెలుగు రాష్ట్రాల ప్రజలు వ్యవహరిస్తున్నారు. మహమ్మారి పులిలా ఇంటిముందే పొంచి ఉంది. వీధుల్లో తిరుగుతోంది. వద్దురా బాబు రావొద్దురా వస్తే పంజా విసురుతుంది అని నెత్తి, నోరు మొత్తుకుంటున్నా.. ఈ ప్రభుత్వాలింతే.. అంటూ యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అంటూ ప్రధాని స్వయంగా ప్రకటించినా.. పట్టించుకోవడం లేదు. తెలుగు రాష్ట్రాల సీఎంలు నెత్తినోరు మొత్తుకుంటున్నా .. ఏమాత్రం మారడం లేదు. రోడ్లపైకి వచ్చి షికార్లు చేస్తున్నారు.

అసలే వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. కరోనా మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి.  వచ్చే 21 రోజులు చాలా కీలకమంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. కదా .. జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాణాలు కాపాడుకోవాలన్న ఇంగిత జ్ఞానమైనా ఉండొద్దా? అత్యవసరమైన పనులుండి రోడ్డు మీదకు వస్తే సరే..! కానీ చాలా మంది ట్రాఫిక్‌ లేకుండా ఖాళీగా ఉన్న రోడ్లను చూసేందుకు... బైక్‌ల మీద దూసుకుపోయేందుకు వస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. 

అమెరికా లాంటి అత్యున్నత వైద్య పరిజ్ఞానం, పరికరాలు, సిబ్బంది ఉన్న దేశమే కరోనా మహమ్మారి ధాటికి వణికిపోతోంది. సాంకేతికత, ఎకానమీ సహ ఏ రంగం చూసినా... దాని దరిదాపుల్లో లేని ఇండియాలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉండే ప్రమాదం ఉంటుందో అన్న కనీస స్పృహ అయినా ఉండొద్దా ఈ 21 రోజులు ఇంటిలోనే ఉండండి. కాదని బయటకు వెళ్లాలో మహమ్మారిని ఇంటికి ఆహ్వానించినట్లే అది మీప్రాణంతో పాటు మీకుటుంబాన్ని కబళించగలదు. 

ఇంత బతుకు బతికేది మీ కుటుంబం కోసమే కదా.. అలాంటప్పుడు..దాన్ని కాపాడుకోవడం మీ విధి కాదా.. మిమ్మల్ని కాపాడుకుంటూ, మీ పొరుగువారిని ఆపదల్లో పడకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత మీపై ఉంది. సో తెలుగు ప్రజలారా పారాహుషార్.. కాదు మేం మారం.. మేమింతే అంటారా.. ఎదురుగా పులిలా పంజా విసిరేందుకు కరోనా వైరస్ కాచుక్కూర్చుంది. తర్వాత మీయిష్టం.