ఇండియాలో దుమ్ము రేపుతున్న హాలీవుడ్

ఇండియాలో దుమ్ము రేపుతున్న హాలీవుడ్
డబ్బింగ్ సినిమాలకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది.  చైనా తరువాత ఎక్కువ హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతున్న దేశం ఇండియా. ఇక్కడ సినిమాలను ఎలా ఆదరిస్తారో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.  ప్రాంతీయంలో హీరోలకు ప్రాధాన్యత ఉంటుందనే మాట వాస్తవమే అయినప్పటికీ, సినిమా బాగుంటే మాత్రం ఎవరి సినిమానైనా ఆదరిస్తారు.  ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.  మెకన్నాస్ గోల్డ్ నుంచి మొన్న వచ్చిన అవెంజర్స్ ది ఇన్ఫినిటీ వార్ వరకు ఎన్నో సినిమాలకు ఇండియా అతిపెద్ద మార్కెట్ గా నిలిచింది.  2018 లో ఏ ఇండియన్ సినిమా సాధించలేని ఘనతను అవెంజర్స్ సినిమా సాధించింది.  విడుదలైన మొదటి రోజునే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది ఈ సినిమా.  ఈ సినిమా స్పూర్తితో 2018 లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.  
 
హాలీవుడ్ లో నిర్మించే ప్రతి సినిమాను ఇండియాలో విడుదల చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు సదరు నిర్మాతలు.  మే నెలలో డెడ్ పూల్ 2, స్టార్స్ వార్స్ ఆంథోలజి, జూన్ లో జురాసిక్ వరల్డ్ ది ఫాలెన్ కింగ్ డమ్, జులై లో యాంట్ మాన్ అండ్ ది వాస్ప్, స్కై స్క్రాపర్, మిషన్ ఇంపాంజిబుల్ 6 లు వస్తుంటే.. ఆగష్టు నుంచి డిసెంబర్ వరకు వరసగా ప్రెడేటర్, స్కెర్ పేస్, గూస్ బంప్స్ 2, స్మాల్ ఫూట్, వేనోమ్, ఫస్ట్ మాన్, మోగ్లీ, ఫెంటాస్టిక్ బీట్స్ అండ్ వేర్ టు ఫైండ్ దెమ్ 2, స్పైడర్ మ్యాన్ ఇన్ టు ది స్పైడర్ వెర్సె, మోర్టాల్ ఇంజిన్స్, ది ఆక్వామెన్, ట్రాన్స్ఫార్మర్స్ 6 వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి.  
 
ఇక ఇండియాలో 2016 తో పోలిస్తే 2017 హిందీ సినిమా వసూళ్లు 9.1% మేర తగ్గిపోయాయి.  ఇదే సమయంలో హాలీవుడ్ నుంచి తర్జుమా అయ్యి ఇండియాలో రిలీజ్ అయిన చిత్రాలు వసూళ్ల పరంగా దూసుకుపోతున్నాయి.  2013 లో రూ.375 కోట్లు ఉన్న మార్కెట్, 2017 దగ్గరికి వచ్చే సరికి రూ. 801 కోట్లకు పెరిగింది.  2018 లో మార్కెట్ ఇండియాలో హాలీవుడ్ మార్కెట్ మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.  మొదటి ఐదు నెలల్లోనే భారీ స్థాయిలో హాలీవుడ్ చిత్రాలు వసూళ్లు సాధించాయి.  అవెంజర్స్ ది ఇన్ఫినిటీ వార్ ఇప్పటి వరకు ఇండియాలో రూ.256.91 కోట్లు గ్రాస్ ను సాధించి ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాగా చరిత్ర సృష్టించింది.  ఫాంటసీ యాక్షన్ చిత్రాలకు ఇండియాలో ఆదరణ లభిస్తుండటంతో.. ఇదే కోవలో మరిన్ని చిత్రాలను ఇండియాలో రిలీజ్ చేయడానికి హాలీవుడ్ నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.