ప్రపంచంలో మొదటి కరోనా టీకా ఏ దేశం నుంచి రాబోతున్నది?

ప్రపంచంలో మొదటి కరోనా టీకా ఏ దేశం నుంచి రాబోతున్నది?

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడాలి అంటే టీకా రావాలి.   వైరస్ ను అంతమొందించే టీకా వచ్చినపుడే  కరోనాకు చెక్  పడుతుంది.  అప్పటి వరకు ప్రపంచం ఇబ్బంది పడక తప్పదు.  అయితే, కరోనాను అంతం చేసే టీకా తయారీలో  చాలా దేశాలు నిమగ్నమై ఉన్నాయి.  ఇందులో ముఖ్యంగా అమెరికా, రష్యా, బ్రిటన్ లు వాక్సిన్ తయారీలో ముందు వరసలో ఉన్నాయి.  అమెరికాకు చెందిన  మోడెర్నా కంపెనీ తయారు చేసిన టీకా మూడో దశ మానవ ప్రయోగాలు ఈనెల 27 నుంచి ప్రారంభం కాబోతున్నాయి.  సెప్టెంబర్ నాటికి వాక్సిన్ ను తయారు చేస్తామని ఆ కంపెనీ చెప్తున్నది.  

అటు బ్రిటన్ కూడా కరోనా వాక్సిన్ ను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి విపణిలోకి తీసుకొస్తామని అంటోంది. అయితే, రష్యా మాత్రం ఈ రెండింటికి భిన్నంగా ఆగష్టు రెండో వారం వరకు కరోనా టీకాను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడంతో  ప్రపంచం షాక్ అయ్యింది.  ఇప్పటికే అన్ని దశల్లో వాక్సిన్ ను పరీక్షిస్తున్నామని, మంచి ఫలితాలు వస్తున్నాయని రష్యాలోని సెషనోవ్ విశ్వవిద్యాలయం పేర్కొన్నది.   దీనిని బట్టి చూస్తే అమెరికా, బ్రిటన్ ల కంటే ముందుగానే రష్యా నుంచి వాక్సిన్ వచ్చే అవకాశం ఉంటుంది.   కరోనా వాక్సిన్ విషయంలో అన్ని దేశాలు ఆశాజనకమైన వార్తలు చెప్తున్నా,  ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం వచ్చే ఏడాది వరకు కరోనా వాక్సిన్ రాదనీ చెప్తున్నది.   ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో కరోనా వాక్సిన్ ను ఏ దేశం తయారు చేసినా, దానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది.  అందుకోసమే అన్ని దేశాలు ఈ వాక్సిన్ ను తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి.