పురాతన నగలెక్కడ?

పురాతన నగలెక్కడ?

తిరుమల శ్రీవారి ఆలయ ఆగమ శాస్త్ర నియమాలను గాలికి వదిలేస్తున్నారని టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించారు. రాజకీయ నాయకులు, అధికారులు తమ స్వార్థం కోసం స్వామి వారి సేవల సమయాన్ని కుదించి ఆలయాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. దేవాలయాలకు రాజకీయాల నుంచి విముక్తి కలిగించాలని పేర్కొన్నారు. చెన్నైలో ఆయన మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ.. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన ఆభరణాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ప్రధానార్చకుడిగా తనకు టీటీడీ ఆభరణాల వివరాలు తెలియడం లేదని అన్నారు. ఆభరణాల వివరాలు, ఆలయ లెక్కలను బహిర్గతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి నియమించిన ఐఏఎస్‌ అధికారి అప్పట్లో వెయ్యికాళ్ల మండపం కూల్చివేశారన్నారు. ఆలయం గురించి తెలియని అధికారులను నియమించి ప్రభుత్వం తప్పు చేసిందని విమర్శించారు. ఏ చరిత్రా తెలియని పాలకమండలి, అధికారుల వల్ల ఆలయ ప్రతిష్ఠ మంటగలుస్తోందని రమణ దీక్షితులు అభిప్రాయపడ్డారు. అర్చక వారసత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధమని అన్నారు.

ఆలయంలో పెరుగుతున్న మహాపచారాల కారణంగానే పిడుగులు, ఉరుములు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయన్నారు. ఇది స్వామివారి ఆగ్రహమేనని స్పష్టం చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ అనే నినాదంతో ఆలయాన్ని, ఆగమ శాస్త్రాలను కాలరాసి ఏకంగా  హిందుమతాన్ని కనుమరుగు చేసే భారీ కుట్ర జరుగుతున్నట్టుందని రమణ దీక్షితులు ఆందోళన వ్యక్తం చేశారు. చారిత్రక విశేషాలు తెలియని అధికారులు ఆలయం లోపల రంగనాయకుల మండపంలో అలంకరణల పేరుతో డ్రిల్లింగ్‌ యంత్రాలతో రంధ్రాలు వేసి పునాదులు బలహీనపడేలా చేస్తున్నారని ఆరోపించారు. ఆలయ పవిత్రతను, ప్రాచీనతను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రాలు సమర్పిస్తామని రమణదీక్షితులు తెలిపారు.