3 రాజధానులను వ్యతిరేకిస్తున్న బీజేపీ జనసేన పార్టీల నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

3 రాజధానులను వ్యతిరేకిస్తున్న బీజేపీ జనసేన పార్టీల నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

  కీలక ప్రతిపాదనలు గవర్నర్‌ కోర్టుకి చేరాయి. ఆ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న ఆ రెండు పార్టీలు ఇప్పుడేం చేయబోతున్నాయి. లేఖలతో సరిపెడతాయా.. ఢిల్లీ వెళ్తాయా? సరైన సమయంలో ఢిల్లీ నిర్ణయం తీసుకుంటుందన్న డైలాగులు ఏమయ్యాయి. ఏపీ రాజకీయాలను ఇవే అంశాలు హీటెక్కిస్తున్నాయి. 

వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటిస్తారా? కేంద్రంతో మాట్లాడతారా?

ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనలకు అధికార పార్టీ మినహా అన్నిరాజకీయ పక్షాలు అడ్డుపడుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి. ఈవిషయంలో టీడీపీతో పాటు బీజేపీ, జనసేనలు రోడ్డెక్కి నిరసనలు చేశాయి. రైతుల దీక్షలకు సంఘీబావం తెలిపాయి. అమరావతి విషయంలో బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానం చెయ్యగా.. జనసేన తమది కూడా అదే నిర్ణయం అని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ అంశం రాజ్‌భవన్‌కు చేరుకుంది. మరి.. ఈ రెండు పక్షాలు ఇప్పుడు ఏం చెయ్యబోతున్నాయి అనేది తేలాల్సి ఉంది. కేవలం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి ఊరుకుంటాయా.. లేక కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ పెద్దలతో మంత్రాంగం నడుపుతాయా అన్న చర్చ మొదలైంది. 

రాజకీయంగా గళం వినిపించే అవకాశం కోల్పోతారా?

రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తామని పార్టీ నేతలు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. మరి.. ఈ అంశాన్ని కమలనాథులు జనాల్లోకి తీసుకెళ్తరా? జనసేన కలిసి పోరాటం చేస్తుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏమీ చేయలేకపోతే రాజకీయంగా గళం వినిపించే అవకాశం కోల్పోతామని పార్టీ శ్రేణులు కామెంట్స్‌ చేస్తున్నాయట. ప్రభుత్వ చర్యలకు బ్రేక్‌ వేయగలిగితే రాజకీయ మారుతుందని అభిప్రాయ పడుతున్నారట. అంతేకాదు.. ఆ విధంగా బీజేపీ, జనసేన బలపడేందుకు అవకాశం లభిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. 

సరైన సమయం వచ్చిందో లేదో చెప్పాలా?

అయితే ఏపీ బీజేపీ నేతలు.. జనసేన నాయకులు కలిసి కేంద్రాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తారన్నది ప్రశ్నగా ఉంది. అమరావతిని అంగుళం కూడా కదపలేరు అని సుజనా చౌదరి లాంటి వారు అనేకసార్లు ప్రకటనలు ఇచ్చారు. సరైన సమయంలో కేంద్రం జోక్యం ఉంటుందని చెప్పారు. మరి.. ఆ సమయం వచ్చిందో లేదో బీజేపీ నేతలే చెప్పాలి. ఒకవేళ ఈ విషయంలో  ప్రభుత్వం ముందుకెళ్లితే మాత్రం ఆ తర్వాత బీజేపీ నేతలు  చెప్పడానికి చేయడానికి ఏమీ ఉండదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జనసేనాని కూడా రంగంలోకి దిగే టైమ్‌ వచ్చిందని అంటున్నారు. 

కేంద్రాన్ని ఒప్పించే నాయకులు ఎవరు ఉన్నారు?

విభజన చట్టం ప్రకారం ఏర్పడిన రాజధానిని వికేంద్రీకరించాలంటే ఆ చట్టంలో మార్పులు చెయ్యాలన్నది బీజేపీ వాదన. ఢిల్లీ వెళ్లే కమలనాథులు ఇదే విషయం చెప్పే వీలుంది. అయితే కేంద్రాన్ని ఒప్పించే నేతలు ఏపీ బీజేపీలో ఎవరు ఉన్నారు అని చర్చించుకుంటున్నారట. కొందరు బీజేపీ నాయకులైతే తమ పరిచయాల ద్వారా ఇప్పటికే హస్తిన నేతల చెవిలో బిల్లుల విషయాన్ని వేసినట్లు సమాచారం. అయితే.. ఎవరెన్ని ఎతుగడలు వేసినా.. ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలు.. పరిణామాలు చూస్తుంటే.. ప్రభుత్వం ముందడుగు వేసే సూచనలే కనిపిస్తున్నాయని అంటున్నారు. మరి.. బీజేపీ-జనసేనలు ఎలాంటి మంత్రదండం వేస్తాయో చూడాలి.