ప్రముఖుల సెక్యూరిటీ చేతిలో ఉండే ఈ బ్రీఫ్ కేస్ ఏమిటో తెలుసా ?

ప్రముఖుల సెక్యూరిటీ చేతిలో ఉండే ఈ బ్రీఫ్ కేస్ ఏమిటో తెలుసా ?

ప్రధాని మోదీకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అంటే ఎస్పీజీ రక్షణ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. మోదీకి రక్షణ కోసం రోజుకు రూ.1.62 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నారని ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం జరిగింది. ప్రధాని దేశంలో లేదా విదేశాల్లో ఎక్కడ పర్యటించినా ఎస్పీజీ కమాండోలు రక్షణ కల్పిస్తారు. ప్రధాని కంటే ముందే ఒక టీమ్ అక్కడికి వెళ్లి క్లియరెన్స్ ఇచ్చాకనే మరో టీమ్ వలయంలో ప్రధాని అక్కడకి వస్తారు. అయితే మనం చూసినట్టు అయితే ప్రధాని పక్కనే ఉండే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో ఒక బ్రీఫ్ కేస్ ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా ? ఆ బ్రీఫ్ కేస్ ఏమిటా అని ?

ఈ సూట్‌ కేస్ ఒక రకంగా చెప్పాలంటే పోర్టబుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అనే చెప్పాలి. ఇది ప్రధానకే కాదు జెడ్ లేదా జెడ్ ప్లస్ రక్షణ కల్పించే అందరికీ ఉంటుంది. ఈ బ్రీఫ్ కేస్ సదరు వీఐపీకి కొన్ని అడుగుల దూరంలో ఉంచబడుతుంది. చూడడానికి ఏదో సాధారణ బ్రీఫ్ కేస్, అంటే సదరు సెక్యూరిటీ వాళ్ళు ఏవో వీఐపీకి సంబందించిన ఫైల్స్ మోస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇది పోర్టబుల్ బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ ఒక వేళ సదరు వీఐపీ మీద దాడి చేసినట్టయితే ఇది లెవెల్ 3 NIG ఆర్మర్ గా పనిచేస్తుంది. దాడి చేసినప్పుడే కాదు, సదరు సెక్యూరిటీ అధికారికి దాడి జరగవచ్చేమో అనే అనుమానం వచ్చినా ఆ షీల్డ్ ఓపెన్ చేయవచ్చు, ఇది వివిఐపిలకు తక్షణ మరియు తాత్కాలిక రక్షణ కల్పించే కవచంగా పనిచేస్తుంది.