అవంతికి ఏమైంది?

అవంతికి ఏమైంది?

స్టాక్‌ మార్కెట్ ఇన్వెస్టర్లను వేధిస్తున్న ప్రశ్న ఇది. ప్రతి ఏడాది కనీసం 80 శాతం చొప్పున.. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా పదేళ్ళు పెరిగిన షేర్‌ అవంతి ఫీడ్స్‌. అంటే ఓ దశాబ్దకాలంలో ఏకంగా 40,000 శాతం పెరిగిందన్నమాట. కంపెనీ పనితీరులో పెద్దగా మార్పు లేకపోగా... అదనపు ఉత్పత్తి సామర్థ్యం చేతికి వచ్చే సమయలో కేవలం అతి తక్కువ కాలంలో కంపెనీ షేర్‌ ఏకంగా 40 శాతం క్షీణించడం మార్కెట్‌ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఏప్రిల్‌ 26వ తేదీ నాటి ధరతో పోలిస్తే షేర్‌ విలువ 38 శాతం క్షీణించింది.  గత ఏడాది నవంబర్‌ నెలలో రూ. 3000 తాకిన అవంతి ఫీడ్స్‌ షేర్‌ ధర  ఇవాళ 1486 వద్ద ముగిసింది. అంటే ఆరు నెలల్లో సగానికి పైగా క్షీణించిందన్నమాట.

ఎందుకు?
రొయ్యల ఎగుమతిపై అధికంగా ఆధారపడిన అవంతి ఫీడ్స్‌ 2017లో కూడా 45 లక్షల టన్నుల రొయ్యలను ఎగుమతి చేసింది. అయితే గడచిన మూడు నాలుగు నెలల్లో రొయ్యల ధరలు క్షీణించడం కంపెనీ షేర్ లో అమ్మకాల ఒత్తిడి ఒక కారణంగా మార్కెట్‌ వర్గాలు అంటున్నారు. అలాగే  మార్కెట్‌ సూచీలలో పెద్దగా పతనం లేకున్నా... కొన్ని వందల మిడ్‌ క్యాప్‌ షేర్లు భారీగా క్షీణించాయని, అదే ట్రెండ్‌ ఈ షేర్‌లో కూడా  కన్పించిందని మరికొందరు అంటున్నారు. ధరలు బాగా తగ్గడంతో కంపెనీ ఉత్పత్తి కూడా తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రొయ్యల ధరలు తగ్గడం తాత్కాలికమని కంపెనీ అంటోంది. అమెరికాలో చలికాలం ఎక్కువ రోజులు కొనసాగడంతో రొయ్యల  డిమాండ్‌ తగ్గిందని, అయితే ఇపుడు సాధారణ స్థాయికి చేరిందని కంపెనీ అంటోంది. ఇండోనేషియా, వియత్నాం వంటి దేశల్లో రొయ్యల పెంపకం సాధారణ స్థాయిలో ఉండటం వల్ల ధరలు స్థిరంగా ఉంటున్నాయని కంపెనీ చెబుతోంది. మరొకొన్ని రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని, ప్రధానంగా చైనాకు ఎగుమతులు పెరుగుతాయని అవంతి ఫీడ్స్‌ యాజమాన్యం ధీమాతో ఉంది. ప్రస్తుతం అవంతీ ఫీడ్స్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ వార్షిక సామర్థ్యం 7000 టన్నులు కాగా... గత ఏడాది డిసెంబర్‌లో 15,000 టన్నుల సామర్థ్యమున్న ప్లాంటులో ఉత్పత్తి  మొదలైందని కంపెనీ పేర్కొంది. కంపెనీ పనితీరులో ఎలాంటి మార్పులేదని, త్వరలోనే మునుపటి వైభవం వస్తుందని కంపెనీ ఆశాభావంతో ఉంది.