మోడీజీ.. రషీద్‌ను మీకివ్వం..

మోడీజీ.. రషీద్‌ను మీకివ్వం..

కోల్‌కతాతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఒంటి చేత్తో గెలిపించిన యువ లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఇన్‌స్టంట్‌ సెలబ్రిటీగా మారిపోయాడు. ఆల్‌రౌండ్‌ షోతో అద్భుతంగా రాణించిన రషీద్‌ను క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టీ20 ఫార్మాట్‌లో రషీద్‌ గొప్ప ఆటగాడంటూ మ్యాచ్‌ జరుగుతుండగానే సచిన్‌ టెండూల్కర్‌ ట్వీట్‌ చేశాడు.

ఇవాళ ఉదయం ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘునీ.. రషీద్‌ఖాన్‌ తమ హీరో అంటూ పొగిడారు. 'రషీద్ ఖాన్‌ను చూసి ఆప్ఘాన్లంతా గర్విస్తున్నారు. అతడి నైపుణ్యాన్ని బయటపెట్టే అవకాశం ఇచ్చిన భారతీయ మిత్రులకు ధన్యవాదాలు. క్రికెట్ ప్రపంచానికి అతడో ఆస్తి. మోడీజీ.. మేం అతణ్ని మీకు ఇవ్వలేం' అంటూ అప్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మోడీ అకౌంట్‌ను ట్యాగ్‌ చేశారు. బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తున్న రషీద్‌కు భారత పౌరసత్వం ఇవ్వాలంటూ అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఘునీ ఈ విధంగా ట్వీట్‌ చేశారు.

ఇక మ్యాచ్‌ ముగిశాక తెలంగాణ మంత్రి కేటీఆర్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తదితరులు రషీద్‌కు ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు. మ్యాచ్‌ చూడలేకపోయానని చెప్పిన కేటీఆర్‌.. ట్రోఫీ అందుకోవాలంటూ ఆకాంక్షించారు.