నష్టాల్లో వాల్‌మార్ట్‌ షేర్‌

నష్టాల్లో వాల్‌మార్ట్‌ షేర్‌

భారత్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌లో భారీ పెట్టుబడి పెట్టడం అమెరికా ఇన్వెస్టర్లకు నచ్చనట్లుంది. ఈ వార్త వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్‌లో వాల్‌మార్ట్‌ కౌంటర్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఒకదశలో షేర్‌ 82 డాలర్లకు అంటే నాలుగు శాతంపైగా క్షీణించింది. అయితే మోర్గాన్‌ స్టాన్లీ వంటి సంస్థలు వాల్‌మార్ట్‌ డీల్‌కు మద్దతుగా మాట్లాడటంతో షేర్‌ చివర్లో కోలుకుంది. రాత్రి 2.38 డాలర్ల నష్టంతో అంటే 3 శాతం క్షీణించి 83.06 డాలర్ల వద్ద వాల్‌మార్ట్‌ షేర్‌ ముగిసింది. మార్కెట్‌ తరవాత జరిగే ఆఫ్‌ మార్కెట్‌ డీల్స్‌లో కూడా షేర్‌ స్వల్పంగా పుంజుకుని 83.35 వద్ద ట్రేడవుతోంది.  ఫ్లిప్‌ కార్టుకు మున్ముందు కూడా కొన్నేళ్ళపాటు నష్టాలు తప్పవని అమెరికా మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ఫ్లిప్‌కార్టులో పెట్టుబడి కారణంగా వాల్‌మార్ట్‌పై ఆదాయం ఒక్కో షేరుకు 25 సెంట్ల నుంచి 30 సెంట్ల వరకు తగ్గవచ్చని వీరి అంచాన. అయితే మోర్గాన్‌ స్టాన్లీ మాత్రం వాల్‌మార్ట్‌ డీల్‌ కంపెనీకి లాభదాయకమని పేర్కొంది. మరో పదేళ్ళలో  భారత ఈ కామర్స్‌ మార్కెట్‌ విలువ 20000 కోట్ల డాలర్లకు చేరుతుందని ఈ సంస్థ అంచనా వేసింది.