వాల్‌మార్ట్‌ గో బ్యాక్!

వాల్‌మార్ట్‌ గో బ్యాక్!

వాల్‌మార్ట్ - ఫ్లిప్‌కార్ట్ మధ్య డీల్ కుదిరింది... 16 బిలియన్‌ డాలర్లకు ఫ్లిప్‌కార్ట్‌లోని 77శాతం వాటాను కొనుగోలు చేసినట్టు వాల్‌మార్ట్ ప్రకటించింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌ కొనుగోలు చేయడంపై కొందరు చిరు వ్యాపారులు, రైతు సంఘాలు నిరసనకు దిగుతున్నాయి. హిందూత్వ వాదులు, కొన్ని రైతు సంఘాలు, చిన్న వ్యాపారులు తమకు భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుందని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. కాగా, ఈ నిరసన కార్యక్రమాలు ఈ డీల్‌కు కొంత విఘాతం కలిగిస్తాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. వచ్చే ఏడాదే ఎన్నికలు రానుండడంతో ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ డీల్‌ కొంత నష్టం కలిగిస్తుందన్న అంచనాలతో ప్రభుత్వం సైతం కొంత విముఖత వ్యక్తం చేయవచ్చనే అంచనాలున్నాయి. 

మరోవైపు ప్రధాని మోదీ చిరు వ్యాపారులు, రైతులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుండగా... బీజేపీ కీలక కమిటీ విదేశీ పెట్టుబడులకు సైతం కొంత ప్రోత్సాహం కల్పిస్తుండటంతో పెట్టుబడులపరంగా వాల్‌మార్ట్‌ - ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌ ఎంతమేరకు విజయవంతం అవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయంగా ప్రభుత్వానికి ఈ డీల్‌ కొంత మింగుడుపడటం కష్టమనే వాదనలున్నాయి. కాగా, ఇటీవలే మోదీ సర్కార్‌ను విమర్శిస్తూ సీపీఎం... వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌ను వ్యతిరేకించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరచి ఇలాంటి డీల్స్‌కు మాత్రం బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని ఆరోపించింది. అయితే మరోవైపు పీఎంవో ఈ డీల్‌కు ఓకే చెప్పలేదనే వార్తలు వస్తున్నాయి. ఫ్రాంచైజీ మోడల్‌లో భారత్‌లో వాల్‌మార్ట్‌స్టోర్లు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు వాల్‌మార్ట్‌ సీఈవో... ఈ ప్రతిపాదనలు చిరు వ్యాపారులకు తీరని విఘాతం కలిగిస్తాయంటున్నారు నిపుణులు. దీంతో వాల్‌మార్ట్‌ గోబ్యాక్‌ నినాదాలు చేస్తూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.