వాల్‌మార్ట్ చేతుల్లోకి ప్లిప్‌కార్ట్‌

వాల్‌మార్ట్ చేతుల్లోకి ప్లిప్‌కార్ట్‌

గత కొద్దిరోజులుగా దేశ వాణిజ్య రంగంలో అతిపెద్ద డీల్‌గా చెప్పుకుంటున్న ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్‌‌పై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఫ్లిప్‌కార్ట్‌లోని 77 శాతం వాటాను.. 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు వాల్‌మార్ట్ ప్రకటించింది. ఈ ఏడాది చివరకు ఈ డీల్‌ను పూర్తి చేయనున్నట్లు వాల్‌మార్ట్ సీఈవో మయవోషి తెలిపారు. తమ పెట్టుబడులు భారతీయులకు నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించేందుకు ఉపయోగపడతాయని... కొత్త ఉద్యోగాల కల్పన..  చిన్న సప్లయర్లకు, వ్యవసాయదారులకు, మహిళా వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు అందనున్నాయని ఆయన అన్నారు. పారిశ్రామిక వేత్తలుగా రాణించాలనే లక్ష్యంతో ఢిల్లీకి చెందిన ఇద్దరు బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్‌లు అమెజాన్‌ ఉద్యోగాన్ని వదులుకుని ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించారు. మొదట బెంగళూరు నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించి.. అనంతరం దేశం మొత్తానికి విస్తరించి భారత్‌లో అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజంగా ఫ్లిప్‌కార్ట్‌ను నిలబెట్టారు. తాజా డీల్‌తో భారతీయ రిటైల్ రంగంలో అమెరికా ఆధిపత్యం పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఇకపై అమెజాన్-వాల్‌మార్ట్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది.