ఐదు గ్రామాల్లో ప్రతీ వ్యక్తికి రూ.10 వేలు-సీఎం జగన్

ఐదు గ్రామాల్లో ప్రతీ వ్యక్తికి రూ.10 వేలు-సీఎం జగన్

విశాఖపట్నం జిల్లాలో గ్యాస్‌ లీకేజ్ ఘటన కలకలం రేపింది.. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా... వందలాది మంద్రి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. పూర్తిగా కోలుకున్నవాళ్లను డిశ్చార్జ్ చేస్తున్నారు.. ఇక, ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాతో పాటు అనారోగ్యం బారినపడి ఆస్పత్రిపాలైన వారికి అందించ నష్టపరిహారం కింద రూ. 30 కోట్లు విడుదల చేసింది ఏపీ సర్కార్.. గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్ ప్రకటించినట్టుగా రూ. కోటి ఎక్స్‌‌గ్రేషియా ఇవ్వనున్నారు.. ఇప్పటికే ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. తీవ్ర అస్వస్థతకు గురై వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, ఆస్పత్రిలో రెండు, మూడు రోజుల చికిత్స అవసరమైన వారికి రూ.లక్ష, స్వల్ప అస్వస్థతకుగురై ప్రథమచికిత్స పొందిన వారికి రూ.25 వేలు, గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లోనూ ప్రతీ కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాహాయం చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే, ఇవాళ బాధిత గ్రామాల్లో సహాయక చర్యలపై మంత్రులు బొత్స, కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌తో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. ఆయా గ్రామాల్లో ఎంతమంది ఉంటే.. అందిరికీ రూ.10 వేల చొప్పున అందించాలని ఆదేశించారు. చిన్న పిల్లలు సహా ప్రతీ ఒక్కరికి రూ.10 వేలు అందించాలని ఆదేశించి సీఎం.. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని.. ఆ డబ్బు మొత్తం ఇంట్లోని మహిళ బ్యాంకు ఖాతాల్లో  జమ చేయాలని సూచించారు.