విశాఖ గ్యాస్ బాధితులకు ఆరోగ్యశ్రీలో చికిత్స     

విశాఖ గ్యాస్ బాధితులకు ఆరోగ్యశ్రీలో చికిత్స     

విశాఖలో కెమికల్ గ్యాస్ బాధితులకు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తుందని తెలిపింది ప్రభుత్వం. గుర్తింపు పొందిన ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో నైనా బాధితులు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే వైద్య సేవలను పొందవచ్చని స్ఫష్టం చేసింది. ఆరోగ్యశ్రీ తో అనుసంధానం అయిన హాస్పిటల్స్‌తో పాటు అనుసంధానం కాని హాస్పటల్స్‌కు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. దీనిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

గ్యాస్ బాధితులు ఎవరైనా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి నప్పుడు వారి ఆధార్ కార్డ్, ఇతర వివరాలను తీసుకొని చికిత్స అనంతరం వైద్య సేవల బిల్లులతో సహా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కి పంపాల్సి ఉంటుంది. వైద్యం కోసం ఎంత ఖర్చు అయినా చెల్లించాలని, దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రమాదవశాత్తు లీకైన గ్యాస్ వల్ల ప్రజలు ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా సత్వర వైద్య సేవలు లభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సహాయం కోసం ఆరోగ్య శ్రీ హెల్ప్ లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించింది ప్రభుత్వం.