జట్టు సభ్యులతో సిరాజ్ ఇంటికి కోహ్లీ

జట్టు సభ్యులతో సిరాజ్ ఇంటికి కోహ్లీ

హైదరాబాద్ యువ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇంటికి వచ్చి అందరికీ సర్ ఫ్రైజ్ ఇచ్చారు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు. ఐపీఎల్‌-11లో భాగంగా బెంగళూరు జట్టు నేడు సన్‌రైజర్స్  హైదరాబాద్‌తో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ కోసం ఆదివారం బెంగళూరు జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది. సాయంత్రం వరకు ఉప్పల్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసిన ఆనంతరం.. కెప్టెన్ విరాట్  కోహ్లీతో పాటు కొందరు ఆర్సీబీ ఆటగాళ్లు టోలిచౌక్‌లోని సిరాజ్‌ ఇంటికి వెళ్లారు. వారిలో పార్ధీవ్ పటేల్ కూడా ఉన్నాడు. 

ఇంటికి విచ్చేసిన కోహ్లీ టీంకి ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యానీతో పాటు హైదరాబాద్ కబాబ్స్ తో విందు ఏర్పాటు చేశాడు సిరాజ్. కెప్టెన్ తన ఇంటికి రావడంతో సిరాజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రెండు గంటల పాటు అందరూ సిరాజ్ ఇంట్లో సందడి చేశారు. ఆ తర్వాత హోటల్ కి చేరుకున్నాడు. భద్రత దృష్ట్యా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ప్రత్యేక పోలీస్ బృందం క్రికెటర్లకు సెక్యూరిటీ ఇచ్చింది. హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేసిన కోహ్లీ చాలా బాగుందని.. కబాబ్స్ టేస్ట్ అదిరిందంటూ ప్రశంసించాడు. అయితే 2.6 కోట్ల రూపాయల ప్యాకేజీతో సిరాజ్ ను ఐపీఎల్ లో బెంగళూరు జట్టు దక్కించుకున్న విషయం తెలిసిందే.