కరోనాకు విరుగుడు ఇదేనట..!

కరోనాకు విరుగుడు ఇదేనట..!

కరోనా వైరస్ డ్రాగన్ కంట్రీలో పుట్టినా.. ప్రపంచం మొత్తం ఆ పేరు వింటేనే వణికిపోతోంది. ఇప్పటికే భారీ ఎత్తున ప్రాణం నష్టం జరగగా... లక్షల్లో కరోనా బారినపడ్డారు. అయితే, కరోనాకు ఇదిగో మందు.. ఇలా చేయండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారు లేకపోలేదు. అయితే, ఇప్పటి వరకు శాస్త్రీయంగా కరోనాకు మందును మాత్రం కనిపెట్టింది లేదు. అయితే, జగిత్యాల జిల్లా ధర్మపురిలో కరోనానేపథ్యంలో ఓ వింత ఆచారం ఇప్పుడు వైరల్‌గా మారింది. తమకు ఒక్క కొడుకు ఉన్న మహిళలు.. ఐదు బావుల్లోని నీటిని తీసుకువచ్చి.. అక్కడున్న వేపచెట్టుకు పోస్తే మంచి జరుగుతుందని వారి నమ్మకం... అంతే కాదు.. కరోనా సైతం పారిపోవడం ఖాయమని వాళ్లు నమ్ముతున్నారు. దీంతో. ఇది కాస్త వైరల్‌గా మారింది. ఇక, ఎంతకైనా మంచిది ఓ రాయి వేద్దాం అనుకుంటున్నారో ఏమో.. సాధ్యమైన వాళ్లు.. ఐదు బావుల నీళ్లు వేప చెట్టుకు పోస్తూ.. ఆ ఆచారాన్ని ఫాలో అయిపోతున్నారు. ఇక అంతే కాదు.. ఒక్క కొడుకుంటే ఒక కొబ్బరికాయ.. ఇద్దరు కుమారులుంటే రెండు కొబ్బరి కాయలు వేప చెట్టుకు కొట్టాలనే ప్రచారం కూడా జరుగుతోందట. అసలే.. మాయదారి రోగం.. దానికి ఇంకా మందు కనిపెట్టలేదు.. ప్రజలు మాత్రం దాని భయంతో తెలిసింది.. ప్రచారంలో ఉన్నది, నమ్మింది ఇలా ఫాలో అయిపోతున్నారు. గతంలో తెలియని వ్యాధులు ప్రబలినప్పుడు.. మందులు కూడా అందుబాటులో లేని సమయంలో.. ఇలాంటివి చేసేవాళ్లని చెబుతుంటారు. ఆధునిక యుగంలోనూ ఇలాంటి ఆచారాలను పాటిస్తున్నారు ప్రజలు. అయితే, కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే సరైన మార్గమని సూచిస్తున్నారు వైద్యులు. ఇదే సమయంలో.. వేప చెట్టులోని రోగ నిరోధక శక్తిని, దాని ఉపయోగాలను మాత్రం కొట్టిపారేయడానికి లేదు మరి.