నోటీసులకు భయపడను

నోటీసులకు భయపడను

నోటీసుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. తనకు ఇంత వరకు టీటీడీ నోటీసులు అందలేదని.. ఆ విషయం టీవీలో చూసి తెలుసుకున్నట్టు చెప్పారు. తనకు నోటీసులిచ్చే అధికారం మీకెవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. టీటీడీది కేవలం అభ్యర్థన మాత్రమేనని.. దానిని నోటీస్ అనలేమని తెలిపారు. అయినా నోటీసులు ఇచ్చేందుకు టీటీడీకి ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు. గతంలో తాను 10 విషయాలు మాత్రమే చెప్పానని.. ఇప్పుడు 14 విషయాలు చెబుతానని అన్నారు. ఆరోపణలు చేసిన వ్యక్తిని సోర్స్ ఏంటని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని.. మొద్దు నాయుడు, పప్పు నాయుడుకి నిజంగా దమ్ము, చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని విజయసాయి రెడ్డి సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే తండ్రీకొడుకుల అవినీతి మొత్తం బయటపెట్టి ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని చెప్పారు. 'నేను పదమూడు గంటల సమయం ఇస్తే ఆయన స్పందించలేదు, ఇప్పుడు మళ్లీ చాలెంజ్ చేస్తున్నా, ప్రభుత్వ ఖజానా అని చెప్పి దేవస్థానం నిధులు దోచుకున్నారు' అని ఆయన అన్నారు. వారి ఇంట్లో నేలమాలిగలు సోదా చేసి ఉంటే దోచుకున్న సొమ్ములు దొరికేవని, సీబీఐ విచారణలో మాత్రమే అవన్నీ బయట పడతాయని విజయసాయి రెడ్డి వివరించారు.