మూవీ రివ్యూ : 'కాశి'

మూవీ రివ్యూ : 'కాశి'

నటీనటులు : విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన, అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్, జయప్రకాశ్, నాజర్, మధు తదితరులు  
ఛాయాగ్రహణం :  రిచర్డ్ ఎం. నాథన్    
సంగీతం : విజయ్ ఆంటోనీ
మాటలు-పాటలు : భాష్య శ్రీ 
దర్శకత్వం : కృతిగ ఉదయనిధి
నిర్మాతలు : ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రద్యుమ్న చంద్రపత్రి  
విడుదల తేదీ : 18 మే 2018

తెలుగులో హీరోగా మంచి పేరు, మార్కెట్ సంపాదించుకోవాలని మహ్మద్ గజినీ తరహాలో దండయాత్రలు చేస్తోన్న తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ. మొదట్లో 'డాక్టర్ సలీం' వంటి మంచి సినిమాలు చేసినప్పటికీ అతడికి ఇక్కడ ఫేమ్ వేల్యూ అంతగా లేకపోవడంతో ఆశించిన విజయం సాధించలేదు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా దండయాత్రలు చేశాడు. తరవాత 'బిచ్చగాడు'తో అతడు కోరుకొన్న విజయం దక్కింది. ఆ తరవాత వచ్చిన సినిమాలన్నీ అంతగా ఆడలేదు. కాని విజయ్ ఆంటోనీ కొత్తగా చేస్తాడనే పేరు మాత్రం సంపాదించుకున్నాడు. ఈ రోజు విడుదలైన 'కాశి' అయినా అతడు కోరుకొన్న విజయాన్ని అందిస్తుందా? మరో కొత్త ప్రయత్నం అనదగ్గ సినిమాగా మాత్రమే మిగులుతుందా? రివ్యూ చదివి తెలుసుకోండి.

 
కథ : భరత్ (విజయ్ ఆంటోనీ) అమెరికాలో పేరున్న డాక్టర్. తల్లిదండ్రులు అతని చిన్నతనంలో ఇండియా నుంచి అమెరికా వెళ్లి సెటిల్ కావడంతో అక్కడే పెరిగి పెద్దవుతాడు. అయితే... చిన్నప్పటి నుంచి ప్రతి రోజూ ఉదయం 'ఎద్దు పొడవడంతో అమ్మ చనిపోయినట్టు' అతడికి ఓ కల వస్తుంది. అతడికి 28 ఏళ్లు వచ్చేసరికి ఓ నిజం తెలుస్తుంది... 'అమెరికాలో అతణ్ణి పెంచి పెద్ద చేసినవాళ్లు నిజమైన తల్లిదండ్రులు కాదు' అని. అప్పుడు సొంత తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడం కోసం ఇండియా వస్తాడు. ఇక్కడ అతడికి ఎటువంటి సవాళ్లు ఎదురయ్యాయి? తల్లిదండ్రులను తెలుసుకొనే క్రమంలో పరిచమైన ఊరి సర్పంచ్ (మధు), గజదొంగ కొండవీటి రత్తయ్య (నాజర్), చర్చ్ ఫాదర్ (జయప్రకాశ్) భరత్ అన్వేషణలో ఏ విధంగా సహాయ పడ్డారు? 'కాశి' ఎవరు? అనేది చిత్రకథ.  


నటీనటుల పనితీరు : 
విజయ్ ఆంటోనీ నటనలో కొత్తదనం లేదు. ప్రతి సినిమాలోనూ అతడిది సింగిల్ ఎక్స్‌ప్రెష‌న్‌. ప్రేమ, కోపం, ఆవేదన, ఆరాటం.. సన్నివేశంలోని భావం ఏదైనా అతడి ఎక్స్‌ప్రెష‌న్‌ ఒక్కటే. 'బిచ్చగాడు'లో విజయ్ ఆంటోనీని చూసినట్టే ఉంటుంది. అంజలిది అప్పుడప్పుడూ వచ్చి వెళ్లిపోయే పాత్ర. అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్, సునైనాలవీ అంతే. వారంతా తమ పాత్రల పరిధి మేరకు చేశారు. జయప్రకాశ్, నాజర్, మధులకు సరైన పాత్రలు లభించలేదు. తమిళ హాస్యనటుడు యోగిబాబు ఉన్నంతలో కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు.    

సంగీతం - సాంకేతిక వర్గం : 
విజయ్ ఆంటోనీ బాణీల కంటే భాష్య శ్రీ అనువాద సాహిత్యం పాటలను వినాలంటే ప్రేక్షకులు భయపడేట్టు చేసింది. భాష్య శ్రీ రాసిన మాటల్లోనూ కొన్ని పంచ్ డైలాగులు పేలితే మరికొన్ని పంటికింద రాయిలా పడ్డాయి. రిచర్డ్ సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా సరిగ్గా కుదిరింది. తమిళ నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా క్వాలిటీ సినిమా తీశారు. 

దర్శకత్వం : 
తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ భార్యే ఈ సినిమా దర్శకురాలు కృతిగ. హీరో విజయ్ ఆంటోనీకి కాలేజీలో క్లాస్‌మేట్‌ కూడా. అందుకని ఆమెకు విజయ్ ఆంటోనీ అవకాశం ఇచ్చాడేమోనని సినిమా చూస్తున్నంత సేపూ అనుమానం కలుగుతుంది. ఎందుకంటే... కృతిగ కథలో కొత్తదనం ఏం లేదు. స్క్రీన్‌ప్లేలో కూడా. ఓల్డ్ ఫార్ములా కథతో హీరోని, నిర్మాతలను ఎలా ఒప్పించారో మరి? దర్శకురాలిగానూ మెప్పించిన సందర్భాలు తక్కువ. 


విశ్లేషణ :
నాలుగు కథల సమాహారమే ఈ సినిమా. తల్లిదండ్రులను అన్వేషిస్తూ ఇండియాలో అడుగుపెట్టిన భరత్‌కి ఊరి సర్పంచే అతడి తండ్రి ఏమో అనే అనుమానం కలుగుతుంది. దాంతో అతడికి మందు తాగిస్తాడు. తాగిన మైకంలో సర్పంచే స్వయంగా అతడి కథను చెప్పడం ప్రారంభిస్తాడు. అందులో హీరో పక్కనున్న కమెడియన్ హీరోని ఊహించుకుంటాడు. కథంతా పూర్తయిన తరవాత సర్పంచ్ హీరో తండ్రి కాదని తెలుస్తుంది. మళ్లీ అన్వేషణ మొదటికి వస్తుంది. తరవాత గజదొంగ కొండవీటి రత్తయ్య కథ. అతడు కథ చెబుతుంటే తెరపై హీరో కనిపిస్తాడు. రత్తయ్య కథ చివరికి అతడూ హీరో తండ్రి కాదని తెలుస్తుంది. రెండూ కథలూ పూర్తయ్యేసరికి 'నాన్నా... అదిగో పులి' కథ ప్రేక్షకులకు గుర్తొస్తుంది. మూడో కథపై ఆసక్తి తగ్గుతుంది. పోనీ ఆ కథలను అయినా ఆసక్తికరంగా తీశారా? అంటే... అదీ లేదు. మూడో కథలో ఇప్పటికే చాలాసార్లు చూసిన కులమతాల గొడవలు, వర్ణ వివక్షలను మరింత నిస్సారంగా చూపిస్తాడు. ఆ సన్నివేశాల్లో బలం లేదు. చెప్పుకోవడానికి విజయ్ ఆంటోనీ నాలుగు వేరియేషన్స్‌లో కనిపిస్తాడు. కాని ఒక్క పాత్రలోనూ నటుడిగా మెప్పించలేదు. ప్రతిసారి విజయ్ ఆంటోనీ సినిమాల్లో కనిపించే కొత్తదనం ఈ సినిమాలో కనుమరుగు కావడంతో ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. అక్కడక్కడా యోగి బాబు పంచ్ డైలాగులు నవ్విస్తాయి అంతే.