రంగస్థలం 2 వస్తుందా..?

రంగస్థలం 2 వస్తుందా..?

ఒకప్పుడు సినిమా అంటే మూడు గంటలు ఉంటుంది.  కొన్ని సినిమాలైతే మూడు గంటల కంటే ఇంకా ఎక్కువే ఉంటాయి.  నిడివి ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమాలు చూసేవారు.  కాలంతో పాటు సినిమా కూడా మారిపోయింది.  సినిమా నిడివి రెండు గంటలకు పడిపోయింది.  హాలీవుడ్ టైపులో గంటన్నరకే ముగించాలని చాలామంది కోరుకుంటున్న సమయంలో.. దాదాపుగా మూడు గంటల నిడివితో రామ్ చరణ్ రంగస్థలం వచ్చింది.  పైగా అది పీరియాడికల్ సినిమా.  1980 నాటి పరిస్థితుల ఆధారంగా సినిమా నడిచింది.  అయితేనేం.. ప్రేక్షకులు సీటుకు అతుక్కుపోయి కూర్చున్నారు.  సినిమాను ఎంజాయ్ చేశారు.  

ఈ సినిమా తరువాత వచ్చిన భరత్ అనే నేను, ఆ తరువాత వచ్చిన మహానటి సినిమాలు కూడా దాదాపు మూడుగంటల వరకు నిడివి ఉన్న సినిమాలే.  కథ బాగుంటే.. పీరియాడికల్ సినిమాలు కూడా బాగా ఆడతాయని టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటికే నిరూపించారు. కాగా, ఇప్పుడు పీరియాడికల్ బేస్ లో మరో సినిమా రాబోతున్నది.  నీది నాది ఒకటే కథ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వేణు ఉడుగుల ఓ సినిమా చేయబోతున్నాడు.  1990 నాటి పరిస్థితులకు అనుగుణంగా సినిమా ఉంటుందట.  ఈ సినిమాకు విరాటపర్వం 1992 అనే టైటిల్ అనుకుంటున్నారట.  ఇందులో శర్వానంద్, సాయి పల్లవిలు నటిస్తున్నట్టు సమాచారం. రంగస్థలంలో ఉన్నట్టుగానే.. విరాటపర్వం 1992 లో కూడా ఎమోషన్స్ ఉంటాయని అంటున్నారు దర్శకుడు వేణు.  1980 కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగా రంగస్థలం వస్తే.. 1990 నాటి పరిస్థితులకు అనుగుణంగా విరాటపర్వం 1992 సినిమా వస్తుందన్నమాట.  అంటే దీనిని రంగస్థలం 2 అనుకోవచ్చేమో.