విదేశాలకు వెళ్లండి.. అక్కడే ఉండిపోకండి

విదేశాలకు వెళ్లండి.. అక్కడే ఉండిపోకండి

యువత విదేశాలకు వెళ్లడం తప్పుకాదు కాని అక్కడే ఉండిపోకుండా తిరిగి జన్మభూమికి వచ్చి సేవ చేయాలన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. స్వామి వివేకానంద తన ప్రసంగాలతో విదేశీయల మనసు దోచుకున్నారని.. భారతీయతను ప్రపంచానికి చాటిచెప్పారన్నారు.. యువశక్తికి ఆయన గొప్ప మార్గనిర్దేశకుడని కొనియాడారు వెంకయ్య. ఏ దేశంలో అయినా యువత కలిసికట్టుగా శ్రమిస్తే.. అభివృద్ధి సాధ్యమని చాటిచెప్పిన మహనీయుడు వివేకానంద అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని.. సమాజంలో తెలివితేటలకు కొదవలేదని.. దానికి పదను పెడితే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందుతారని తాను నమ్ముతున్నట్లు వెంకయ్య తెలిపారు. మనదేశంలో ఉద్యోగాలు అనేకం ఉన్నాయి.. కానీ వాటికి కావాల్సిన సరైన నైపుణ్యాలు కావాలని.. సరైన ఆలోచన దృక్పథం లేకపోవడమే నేటి సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని ఉప రాష్ట్రపతి అన్నారు. కులం, మతం, రాష్ట్రం, జిల్లా పేరుతో కొందరు ప్రజలను రెచ్చగొడుతున్నారని.. ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేటప్పుడు కులం, మతం కాకుండా.. వారి క్యారెక్టర్, కాలిబర్ చూడాలన్నారు.