ఆవిరైన 'కోటి' ఆశలు 

ఆవిరైన 'కోటి' ఆశలు 

భారీ మొత్తంలో లాటరీ తగిలిందని ఎగిరి గంతేశాడు. ప్రైజ్ మనీ తీసుకున్న తర్వాత  పెద్ద ఇల్లు, కారు కొనాలని ఊహల్లో తేలిపోయాడు. చేస్తున్న వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావించాడు. కాని ఏమైంది ... అంతలోనే ఆశలన్నీ అడి ఆశలయ్యాయి. కొన్న లాటరీ టికెట్ ఫేక్ అని తెలిసి అవాక్కయ్యాడు. ఈ ఘటన ముంబై కళ్యాణ్ ప్రాంతంలో జరిగింది. సుహాస్ కడెమ్... బ్రెడ్ తయారీ యూనిట్ లో హెల్పర్ గా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయంలో కూరగాయల వ్యాపారం కూడా చేస్తున్నాడు. అతనికి లాటరీ టికెట్లు కొనే అలవాటు బాగా ఉంది. గత ఐదు సంవత్సరాలుగా వేల సంఖ్యలో లాటరీ టికెట్లు కొన్నాడు. కానీ ఎప్పుడూ ఇంత భారీ మొత్తంలో ప్రైజ్ మనీ గెలుచుకోలేదు. కడెమ్ రోజూ లాగానే మార్చి 16 కూడా లాటరీ టికెట్ కొన్నాడు. 20వ తేదీన లాటరీ రిజల్స్ చూసి ఎగిరి గంతేశాడు. తన నంబర్ కు బంపర్ ప్రైజ్ తగిలిందని ఆనందంలో మునిగి తేలాడు. ఆ ప్రైజ్ మనీ మొత్తం విలువ రూ. 1.11కోట్లు. ఇంకేముంది డబ్బు కోసం పరుగు పరుగున టికెట్ సెల్లర్ దగ్గరకు వెళ్లాడు. అంతే.. స్టాల్ యజమాని చెప్పిన సమాధానం విని సుహాస్ షాక్ కు గురి అయ్యాడు. 

ఆ టికెట్ ఫేక్ అని... ఇంతకు ముందే ఆ నంబర్ కు సంబంధించి డబ్బులు తీసుకుని వెళ్లారని టికెట్ సెల్లర్ తెలిపాడు. అతని మాటలు విని సుహాస్ బిక్కమొహం వేశాడు. కళ్యాణ్ లోని మహత్మా పూలే పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర లాటరీ డిపార్ట్ మెంటుకూ ఫిర్యాదు చేశాడు. తాను కొన్న నంబర్ ఒరిజినల్ అంటున్నాడు సుహాస్. ఫేక్ టికెట్ నంబర్ కు డబ్బులు చెల్లించారని వాపోతున్నాడు. ముంబైలో ఫేక్ లాటరీ టికెట్ల వ్యవహారం నడుస్తోందని తెలిపారు. కోట్ల విలువైన ఫేక్ లాటరీ టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబయిలో దాదాపు 4వేల లాటరీ స్టాల్స్ ఉన్నాయి. రోజుకు 15 కోట్ల విలువైన లాటరీ టికెట్లు అమ్ముడవుతాయి. 

సుహాస్ గత ఐదేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. అయితే.. ఏనాడు కూడా రూ. 200 కంటే ఎక్కువ గెలువలేదు. భారీ మొత్తం లాటరీ వచ్చిందని సంతోషంతో ... ఇల్లు, కారు కొనాలని భార్యతో చెప్పాడు. కొంత డబ్బుతో వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలనుకున్నాడు. లాటరీ తగిలిందని బంధువులంతా శుభాకాంక్షలు తెలిపారు. వారికి ఇప్పుడు ఏమి చెప్పుకోవాలో తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు సుహాస్. కల్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలోని స్టాల్ లో లాటరీ  సుహాస్ మార్చ్ 16న టికెట్ కొన్నాడు. ఒక్కొక్క టికెట్ రూ.100తో ఐదు టికెట్లు కొన్నాడు. మార్చి 20న జాక్ పాట్ తగినట్లు తెలిసింది. టికెట్ ఫేక్ అని తెలుసుకున్న సుహాస్... సీఎంతో పాటు థానే పోలీసు కమిషనర్, స్టేట్ లాటరీ డిపార్ట్ మెంట్ ఇన్విస్టిగేషన్ జరిపించాలని లేఖ రాశారు.