ఒక్క పాలసీ - వంద ప్రశ్నలు .

ఒక్క పాలసీ - వంద ప్రశ్నలు .

1. మాతృ / స్థానిక భాష లోనే  అయిదవ తరగతి దాకా విద్య భోదన సాగాలి అనేది సూచన మాత్రమేనా ? లేక తప్పనిసరిగా అనుసరించాల్సిన నిబంధనా ? 

2 . ప్రభుత్వ పాఠశాలలలో కూడా మూడవ ఏటా నుంచే విద్యను మొదలెడుతారా ? అయితే ఇది మాతృ భాషలో సాగుతుందా లేక ఆంగ్లం లోనా ?  

3 . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్ల  మాధ్యమం ప్రవేశపెట్టే క్రమంలో ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఆ ప్రయత్నాలకు బ్రేకులు పడినట్టేనా ? 

4 . పదవ ఏట దాకా భాషలను నేర్చుకొనే సామర్త్యం అధికంగా ఉంటుంది . ఆ వయసులో కేవలం ఒక భాషపై దృష్టి పెట్టి అటు పై ఆంగ్ల మాధ్యమం అంటే అభ్యసనం కుంటుపడదా ?  చైనా,  సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాల్లో ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి ఉన్నత విద్య ఆ స్థానిక  భాషల్లో ఉంటోంది .  మన దేశంలో ఐఐటీ జేఈఈ , నీట్ లాంటి పరీక్షలు ఆంగ్లంలో ఉంటే తల్లి తండ్రులు మాతృ భాషలో విద్య బోధనకు మొగ్గు చూపుతారా ? ఇది కేవలం ఆదర్శంగా మిగిలి పోనుందా ? 

5 . మూడవ తరగతి , అయిదవ తరగతి లో పరీక్షల ఆధారంగా విద్యార్ధి ని ఫెయిల్ చేస్తారా ? ఆ వయస్సు లో బోర్డు పరీక్ష లు నిర్వహిస్తే విద్యార్ధి పై ఒత్తిడి ఉండదా ? కొన్నేళ్ల క్రితం దాకా ఏడవ తరగతి కి కామన్ బోర్డు పరీక్షలు ఉండేవి . అది ప్రహసనం గా మారడం తో వాటిని రద్దు చేసిన సంగతి గుర్తు వుంది కదా ? 

6 . ఇప్పుడు పదవ తరగతి దాకా వున్నా పాఠ‌శాలలు ప్లస్ టు దాకా అప్  గ్రేడ్ చేసుకొనేందుకు అనుమతి ఇస్తారా ? మరి అలాంటప్పుడు జూనియర్ కళాశాలల మాటేంటి ? ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్ని విలీనం చెయ్యాలంటే స్కూల్ అసిస్టెంట్స్ . జూనియర్ లెక్చరర్స్ సీనియారిటీలను ఎలా నిర్ణయిస్తారు ? ఇది వివాదాస్పదం అయ్యి కోర్ట్ ల దాకా వెళితే ఎప్పటికి తేలేను ? 

7. ఐఐటీ ప్రవేశ పరీక్షలో బాగా లోతైన గణితం భౌతిక శాస్త్రం ప్రశ్నలు అడుగుతూ స్కూల్ దశలో పిల్లలు క్రీడలు యోగ మొదలైన వాటిపై దృష్టి కేంద్రీకరించాలి అంటే తల్లితండ్రులు వొప్పుకొంటారా ? అసలు ఐఐటీ జేఈఈ నీట్ లాంటి ప్రవేశ పరీక్షల విధానాన్ని మార్చకుండా స్కూల్ విద్యలో గుణాత్మక మార్పులు తేవడం నేల విడిచి సాము చెయ్యడం కాదా? సంపూర్ణాత్మక విద్య అనేది కేవలం ఒక ఐడియల్ గా మిగిలిపోదా ? 

ఇంకా ఇంకా అనేక ప్రశ్నలు .  

ఇన్ని పాయింట్స్ లేవదీసాను అంటే నూతన విద్య విధానం బాగాలేదని కాదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది విద్యా రంగం  లో గుణాత్మక మార్పులు తేనుంది . ఒక మైలు రాయి కానుంది . గత ఇరవై ఏళ్లలో అనేక టీవీ చానళ్ల చర్చలో నేను లేవనెత్తిన అనేక అంశాలకు ఈ విద్యా విధానం  పరిష్కారం చూపుతోంది. బట్టి చదువులకు మంగళం పాడి విద్యార్థుల్లో లైఫ్ స్కిల్స్ futuristic  స్కిల్స్  తో కూడిన విజ్ఞానాన్ని అందించేందుకు ఇది ఒక సువర్ణావకాశం . కొత్త శకానికి నాంది . 

 నా అభిప్రాయాలు మరింత వివరంగా ఈ రోజు వివిధ చానెల్స్ లో జరిగే డిబేట్స్ లో చెబుతాను

-వాసిరెడ్డి అమర్నాధ్