రాహుల్ బ్రాస్లెట్ వేలం.. ఖమ్మం రైతులకు డబ్బులు

రాహుల్ బ్రాస్లెట్ వేలం.. ఖమ్మం రైతులకు డబ్బులు

గిట్టుబాటు ధర కోసం ఖమ్మం మార్కెట్‌లో జరిగిన ఆందోళనలో జైలుకు వెళ్లొచ్చిన తొమ్మిది మంది రైతులకు తలా ఒక లక్ష చొప్పున అందజేశారు కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నా బ్రాస్‌లెట్ వేలం వేస్తే ఇరవై లక్షలు వచ్చాయి.. అందులో పది లక్షలు ఖమ్మంలో జైలుకు వెళ్లివచ్చిన రైతులకు ఇవ్వాలని రాహుల్ గాంధీ తనకు చెప్పారని.. ఆయన చెప్పిన విధంగానే ఇవాళ డబ్బు అందజేనశానని వీహెచ్ అన్నారు. రైతులు గిట్టుబాటు ధర అడిగితే.. సంకెళ్లు వేయించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. తెలంగాణలో గిట్టుబాటు ధర అడిగితే తప్పని.. రైతులు ధర్నా చేస్తే దొంగతనం కేసులు పెడతారని వీహెచ్ ఆరోపించారు. రైతు బంధు పథకంతో చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగం లేదని.. భూస్వాములకే లాభం చేకూరుతోందని.. దొరల రాజ్యాన్ని పారద్రోలాలని హనుమంతరావు పిలుపునిచ్చారు. నాలుగు సంవత్సరాలలో రైతులకు చేసింది ఏం లేదని.. ఎన్నికల హామీలలో ఒక్కటి అమలు చేయకుండా బాగా ప్రచారం చేసుకున్నారని దుయ్యబట్టారు.

ఇదే కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. దశాబ్ధాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ.. ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదన్నారు.. పంటకు గిట్టుబాటు ధరను అడిగిన పాపానికి రైతులకు దేశద్రోహం కేసులు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసే వరకు మీతోనే ఉంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.