విదేశీ విద్యార్థులపై కొరడా..

విదేశీ విద్యార్థులపై కొరడా..

అమెరికాలో విద్యనభ్యసించడం మనదేశంతో పాటు చాలా దేశాల్లోని విద్యార్థుల కల.. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాలతో చదువుకుని జీవితంలో బాగా స్ధిరపడాలని ఎంతోమంది అనుకుంటారు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతూ వచ్చిననాటి నుంచి వీసా నిబంధనల్లో కొత్త మార్పులు చేస్తూ వచ్చారు. ఇవి ఎన్నో రంగాలపై ప్రభావం చూపాయి. తాజాగా విదేశీ విద్యార్ధులపై కొరడా ఝుళిపించారు ట్రంప్.

వీసా గడువు ముగిసినా అమెరికాను వీడని విద్యార్థుల వివరాలు తెలుసుకునేలా వీసా నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ అగ్రరాజ్యాధినేత ఒక కొత్త ముసాయిదాను తీసుకువచ్చారు. ఈ విధానం ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్ధల్లో చదువుకుంటున్న విద్యార్థులకు వారి నిర్దేశిత కోర్సు సమయం ముగిసిన రోజు నుంచ లేదా అనుమతించిన గ్రేస్ పీరియడ్ ముగిసినప్పటి నుంచి అక్కడ నివసించడం చట్టవిరుద్ధంగానే భావిస్తారు. ఇలాంటి విద్యార్ధులు తనిఖీల్లో దొరికితే.. వారిని 3 నుంచి 10 సంవత్సరాల పాటు అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు..

ఇప్పటి వరకు తేలిన లెక్కల ప్రకారం గడువు ముగిసినా అమెరికాను వీడని విద్యార్థుల్లో చైనీయులు అగ్రస్థానంలో ఉండగా.. వీరి తర్వాతి స్థానంలో భారతీయులు నిలిచారు. తాజా నిబంధనలతో విద్యార్థుల్లోనూ.. వారి తల్లిదండ్రుల్లోనూ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.