అంతుచిక్కని ఆనారోగ్య సమస్య

అంతుచిక్కని ఆనారోగ్య సమస్య

చైనాలోని అమెరికా రాయబార కార్యాలయం ఉద్యోగులను అంతుచిక్కని అనారోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఈ పరిస్థితులకు సంబంధించి రెండు వారాల్లో చైనా రెండో అలర్ట్ ప్రకటించింది. ఈ అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయో ఎవరికీ అర్థం కావటం లేదు.  దౌత్యాధికారులు, కాన్సులేట్ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు అంతుచిక్కని రోగాల బారినపడడంతో అగ్రరాజ్యం  కలవరపడుతోంది. గతంలో క్యూబాలోనూ 24 మంది అమెరికా దౌత్య సిబ్బంది ఇదే తరహా సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తమ ఉద్యోగులకు రక్షణ కల్పించటంలేదంటూ 15 మంది క్యూబా దౌత్యవేత్తల్ని అప్పట్లో దేశం నుంచి ట్రంప్ సర్కార్ బహిష్కరించింది. 

దౌత్యసిబ్బంది విపరీతమైన తలనొప్పి, వాంతులు, వింతవింత శబ్దాలు వినిపించడం, చెవులు పనిచేయకపోవడం, తల తిరగడం, నిద్రలేమి.. సమస్యలతో బాధపడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా హెల్త్ అలర్ట్‌ను ప్రకటించి  ప్రత్యేక వైద్య నిపుణుల బృందాన్ని చైనాకు తరలించింది. సిబ్బందితోపాటు వారి కుటుంబసభ్యులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నది. బాధితుల్లో ఎక్కువగా నరాల సంబంధిత సమస్యలు, ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయి. గతంలో క్యూబాలో అస్వస్థతకు గురైన వారి లక్షణాలు, ప్రస్తుతం చైనా బాధితుల లక్షణాలు ఒకేలా ఉండడం అమెరికా ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 

అమెరికా, చైనాల మధ్య వ్యాపార, వాణిజ్య పోటీ తారాస్థాయికి చేరిన నేపథ్యంలో తమ దౌత్య సిబ్బందిపై కావాలనే కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారనే అనుమానం అగ్రరాజ్యం వ్యక్తంచేస్తోంది. గ్యాంగ్జౌ నగరంలో ప్రస్తుతం 170 మంది అమెరికా దౌత్యసిబ్బంది పనిచేస్తున్నారు. తాము నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో కొంతకాలంగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు ఉద్యోగులపై ధ్వని తరంగాల దాడులు, హానికారక కిరణాల్ని, విష వాయువుల్ని ప్రయోగించే అంశాల్ని కొట్టిపారేయలేమని అమెరికా అధికారులు అంటున్నారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని విదేశాంగశాఖ ఆదేశాలు జారీచేసింది. ఏప్రిల్ లో చైనాలో అస్వస్థతకు గురై అమెరికాకు తరలించిన ఒక ఉద్యోగి మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మరోవైపు అమెరికా ఉద్యోగుల అస్వస్థతపై తమకు ఎలాంటి ఆధారాలు, కారణాలు కనిపించలేదని చైనా విదేశాంగశాఖ ప్రకటించింది.