లేఖ రాసినా స్పందన లేదు..సీబీఐ దర్యాప్తు కోరతా !

లేఖ రాసినా స్పందన లేదు..సీబీఐ దర్యాప్తు కోరతా !

పేదల ఇళ్ల స్థలాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఊరికి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న 'ఆవ' భూములను పేదలకు పంపిణీ చేయడం అన్యాయమని అన్నారు. ఆవ భూముల అవకతవకలపై ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసినా స్పందన లేదన్నారు ఉండవల్లి. దీనిపై సీబీఐ దర్యాప్తు కోరతానని ఆయన స్పష్టం చేశారు. మద్యం కొనుగోళ్లపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరతానన్నారు. ఇసుక కొరత తీర్చాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మద్యం కొనుగోళ్లు ఎంతకి చేస్తున్నారు?  ఎక్కువకు ఎందుకు అమ్ముతున్నారో నిగ్గు తేల్చుతానన్న ఆయన సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి  జగన్మోహనరెడ్డి  మాస్క్  ధరించాలని, మిమ్మల్ని స్పూర్తిగా తీసుకుని ప్రజలు అందరూ మాస్క్  ధరించే అవకాశం ఉందని సూచించారు. ముఖ్యమంత్రి కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా ప్రజల కోసమైనా మాస్క్ పెట్టుకోండని అన్నారు. పొగత్రాగరాదని ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో అదే తరహాలో మద్యంపైనా ప్రచారం చేయాలని అన్నారు, అప్పుడే భవిష్యత్తు తరాలు త్రాగుడు మానేస్తారని అన్నారు. వై ఎస్ కుమారుడిగా జగన్‌ అంటే తనకు అభిమానముందన్న ఉండవల్లి తప్పు చేస్తే ప్రజలపక్షాన విమర్శిస్తానని స్పష్టం చేశారు.