ఎంపీ తీరు సరికాదు..ఇదే నోటీసు..జగన్ సీరియస్ గా తీసుకున్నారు !

ఎంపీ తీరు సరికాదు..ఇదే నోటీసు..జగన్ సీరియస్ గా తీసుకున్నారు !

 ఎంపీ రఘ రామకృష్ణంరాజు ప్రవర్తించిన తీరు సరికాదని శాసన మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, రఘురామకృష్ణం రాజు ఇక పైనా ఇలాగే మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారని అన్నారు. నేతలు పార్టీ ప్రతిష్టకు ఎక్కడా లోపం రాకూడదని సీఎం స్పష్టం చేశారన్న ఆయన ఆ పరిస్థితి వస్తే ఎవరైనా సరే ఎట్టి పరిస్థితిలో చర్యలు తీసుకుంటామని సీఎం గట్టిగా చెప్పారని అన్నారు. నాయకులు ఎక్కడా ఛాలెంజ్ లు చేసుకోవద్దని, పార్టీ ఆదేశం మేరకే ప్రెస్ మీట్ లు పెట్టాలని సీఎం చెప్పారని అన్నారు. 

నరసాపురంలో జరిగిన ఘటనను సీఎం చాలా సీరియస్సుగా తీసుకున్నారని, ఎవరు తొందర పడ్డారనే విషయమై సీఎం జగన్ విచారణ చేయిస్తున్నారని క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి పెద్దవారైనా సరే చర్యలు తప్పవని అన్నారు. రఘురామ కృష్ణం రాజు వ్యవహారాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని జగన్ చెప్పారని, ఇప్పుడు పార్టీ పరంగానే ప్రకటన చేస్తున్నాం.. రఘురామ కృష్ణం రాజుకు ఇదే నోటీసుగా  పరిగణించాలని అన్నారు. సీఎం తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఎంపీ ఆరోపించడం సరైంది కాదని ఆయన అన్నారు. 

ఇక వైకాపా ఎమ్మెల్యే ప్రసాదరాజు మాట్లాడుతూ శాసన సభ్యులను పందుల గుంపుగా ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారని, రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని అన్నారు. పార్టీ లేకపోతే నువ్వు గడ్డి పరకతో సమానమన్న ఆయన తనకు ప్రజా బలం ఉందని చెబుతోన్న ఎంపీ స్వచ్చందంగా రాజీనామా చేసి గెలవాలని అన్నారు. ఇకపై పార్టీకి నష్టం చేకూర్చే కార్యక్రమాలు చేయవద్దని కోరుతున్నామని అన్నారు.