భూవివాదంతో తమ్ముడిపై అన్న దాడి

భూవివాదంతో తమ్ముడిపై అన్న దాడి

తెలంగాణలో రైతుబంధు పథకం భూ తగాదాలకు తావిస్తోంది. పాసు పుస్తకాల్లో భూమి తేడా రావటంతో అన్నదమ్ములు, పొలం ఇరుగు పొరుగు వారు దాడులకు దిగుతున్నారు. పథకం వర్తించాలంటే పాసు పుస్తకాలు తప్పనిసరి. అయితే... గతంలో తప్పుల తడకలుగా ఉన్న పాసు పుస్తకాలను సరిచేసుకునేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి. పాసుపుస్తకాల్లోని భూమికి వాస్తవ భూమికి కొలతల్లో చాలా తేడా వస్తోంది. భూమి కొలతల్లో భారీ వ్యత్యాసం రావటంతో గొడవలు జరుగుతున్నాయి. తాజాగా... మంచిర్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. అన్నదమ్ముల మధ్య  భూతగాదాలు భగ్గుమన్నాయి. నెన్నెల తహాసిల్ధార్  కార్యాలయంలో అన్నదమ్ములు కత్తులతో దాడులకు దిగారు. భూతగాదాలతో తమ్ముడు  లక్ష్మణ్  రెడ్డిపై అన్న బాపు రెడ్డి కత్తితో దాడి చేశారు. తీవ్రగాయాలైన తమ్ముడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కార్యాలయ ఆవరణలోనే దాడికి పాల్పడడం సంచలనం రేపింది. కళ్లల్లో కారంచల్లి అన్న దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. 

ఆఫీసులో రక్తమరకలు చూసిన వారంతా హతాశయులయ్యారు. రైతు బంధు పథకం విషయంలో గొడవ జరగ్గా ఇద్దరు దాడి చేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. బొప్పారం గ్రామానికి చెందిన ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా భూవివాదం సాగుతోంది. తమ్ముడు లక్ష్మణ్ రెడ్డి  హైదరాబాద్ లో ఉంటున్నాడు. గతంలో అన్నకు భయపడి తమ్ముడి భార్య పిల్లలు కరీంనగర్ లో ఉంటున్నారు. భూమి అమ్మే విషయంలో నెన్నల ఎమ్మార్వో ఆఫీసు దగ్గరకు రావడంతో ఈ గొడవ జరిగింది.