తిరుమలలో 17 మందికి కరోనా..పాలకమండలి కీలక నిర్ణయం

తిరుమలలో 17 మందికి కరోనా..పాలకమండలి కీలక నిర్ణయం

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నెలాఖరు వరకు భక్తుల సంఖ్యను పెంచకూడదని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. అత్యవసరంగా సమావేశమైన టీటీడీ బోర్డు తాజా పరిస్థితులపై చర్చించింది. జూన్ 8 నుంచి ఆరువేల మంది భక్తులతో మొదలు పెట్టి రోజుకు 12 వేల మందికి దర్శనం కల్పిస్తున్నామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క భక్తుడికి కూడా కరోనా పాజిటివ్ రాలేదన్నారు. 

ఆదాయం కోసం భక్తుల సంఖ్య పెంచారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కరోనా సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుని భక్తులకు దర్శనం కల్పించేందుకే ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 17 మంది టిటిడి ఉద్యోగులు, పూజారులు, సేక్యూరిటి సిబ్బంది కరోనా పాజిటివ్ వచ్చినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. అయితే వీరికి తిరుమలలో విధులు నిర్వహించడం కారణంగా కరోనా రాలేదని పాలకమండలి స్పష్టం చేసింది. 

ఉద్యోగుల భద్రతపై చర్చించేందుకు కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్లు పాలకమండలి ప్రకటించింది. 15 రోజుల పాటు ఉద్యోగులు తిరుమలలోనే విధులు నిర్వహించేలా మార్పులు చేస్తున్నారు. తిరుమలకు వచ్చే ప్రతి ఉద్యోగికి కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే అనుమతించాలని నిర్ణయించారు. అలానే ఆర్జిత సేవలను ఇప్పట్లో నిర్వహించకూడదని నిర్ణయించారు. 15 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కర్ణాటక చౌల్ట్రి ఇష్యూను కూడా పరిష్కరించారు. శ్రావణమాసంలో కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో వసతి సముదాయాన్ని నిర్మించనుంది. ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యడూరప్ప శంకుస్థాపనలో పాల్కొంటారని చెబుతున్నారు.