హీరో సూర్య తండ్రి మీద టీటీడీ కేసు

హీరో సూర్య తండ్రి మీద టీటీడీ కేసు

  

శ్రీవారి ఆలయంపై దుష్పచారం చేస్తున్న వారిపై టీటీడీ విజిలెన్స్ దృష్టి పెట్టింది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన 8మందిపై పోలీసులు కేసులు పెట్టారు. అందులో హీరో సూర్య తండ్రి కూడా ఉన్నారు. తిరుమల పవిత్రతను కించపర్చే వారిని ఊపేక్షించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. 
టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు అయ్యాయి. తిరుమల క్షేత్రంపై హీరో సూర్య తండ్రి శివకుమార్ సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో అసాంఘిక కార్యకలాపలాలు జరుగుతున్నాయని, ఎవరూ వెళ్లొద్దని వ్యాఖ్యానించారు. శివకుమార్ ఉద్దేశపూర్వకంగానే తిరుమలను పవిత్రను కించపరిచారని తమిళనాడుకు చెందిన తమిళమయ్యన్ అనే వ్యక్తి టీటీడీకి ఫిర్యాదు చేశారు. దీంతో, అతనిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరోపక్క టీటీడీ బోర్డ్ మెంబర్ సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారంటూ... ఫేస్ బుక్ లో అసత్యప్రచారం చేసిన వ్యక్తిపైనా.. కేసు నమోదు చేశారు తిరుమల టూ టౌన్ పోలీసులు. తిరుమల ఆలయంలో జూన్ 30 వరకు దర్శనాలు నిలిపివేశారంటూ మాచర్ల శ్రీనివాసులు, ప్రశాంత్, ముంగర శివరామరాజులు తప్పుడు ప్రచారం చేశారని మరో కేసు పెట్టారు. తిరుమల బౌధ్దారామం అని తలనీలాల సమర్పణ హిందువుల సాంప్రదాయం కాదని ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన వారిపైనా కేసు నమోదు చేశారు. బౌద్ధ ఆలయాన్ని ధ్వంసం చేసి వెంకటేశ్వరస్వామి విగ్రహంగా మార్చారంటూ ఫేస్ బుక్  అకౌంట్‌లో ప్రచారం చేశారు. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 8మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.