'హైదరాబాద్'లో బ్యాటరీతో నడిచే వాహనాలు

'హైదరాబాద్'లో బ్యాటరీతో నడిచే వాహనాలు

హైదరాబాద్‌ నగరంను కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించనున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఆర్టీసీతో పాటు జీహెచ్‌ఎంసీలో క్రమంగా వాటి  వినియోగాన్ని పెంచుతామని.. ప్రైవేటు సంస్థలు కూడా వాటిని కొనుగోలు చేసేలా అవగాహన కల్పిస్తామని అన్నారు. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ ఆటో ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్  ప్రతినిధులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ లో బుధవారం కేసీఆర్‌ను కలిశారు.

నూటికి నూరుశాతం బ్యాటరీతో నడిచే వాహనాల తయారీ పరిశ్రమను స్థానిక కంపెనీలతో కలిసి హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు తెలిపారు. అయితే చైనా బయట పరిశ్రమ నెలకొల్పడం ఇదే ప్రథమమని వారు అన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నగరాలు, పట్టణాల్లో వాహనాలు వెదజల్లే కాలుష్యం పెరిగిపోతున్నదని సిఎం అన్నారు. దీన్ని తగ్గించాలంటే ఎలక్ట్రిక్ వాహనాలు వాడకం తప్పనిసరి అని సిఎం తెలిపారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని క్రమంగా పెంచుతామని.. మొదటి దశలోనే 500 వాహనాలు కొనుగోలు చేస్తామని సిఎం ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ఎక్కువ అవకాశం, ఆవశ్యకత ఉందని సిఎం తెలిపారు. బీవైడీ రూపొందించిన ఎలక్ట్రిక్‌ బస్సుల్లో సీఎం కేసీఆర్‌ కాసేపు ప్రయాణించారు. తర్వాత బస్సు నాణ్యతలు బాగున్నాయని కేసీఆర్‌ అభినందించారు. అయితే ఈ బస్సులు మూడు గంటల్లో ఫుల్‌ ఛార్జ్‌ అవుతాయని.. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 300 నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని బీవైడీ సంస్థ ప్రతినిధులు తెలిపారు.