పార్టీ మారే ఆలోచనలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు?

పార్టీ మారే ఆలోచనలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు?

మూడు దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కురు వృద్ధుడాయన. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన భవిష్యత్‌ ఏంటి? ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? కేడర్‌ను, అనుచరులను మరో పార్టీలోకి పంపి ఎందుకు అక్కడే ఉన్నారు?  ఇంతకీ ఎవరా నేత? 

టీఆర్‌ఎస్‌ ఎంపీ అయినా.. ఆ పార్టీకి దూరం!

ధర్మపురి శ్రీనివాస్‌. కాంగ్రెస్‌ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్‌ఎస్‌లో చేరి.. రాజ్యసభ సభ్యుడైన తర్వాత ఇన్‌యాక్టివ్‌ అయ్యారు. ఓ రకంగా చెప్పాలంటే రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అంటారు. టెక్నికల్‌గా టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడైనా ఆ పార్టీకి చాలా దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌ను వీడి తప్పు చేశానని పలు సందర్భాల్లో చెప్పిన DS.. తిరిగి సొంతగూటికి చేరుకుంటారని ప్రచారం జరిగినా..  ఎందుకో సైలెంట్‌ అయ్యారు. 

ఎంపీ ఎన్నికల్లో కుమారుడి గెలుపుకోసం పనిచేశారా? 
పాలిటిక్స్‌కు గుడ్‌బై చెబుతారా? సొంత గూటికి వెళ్తారా?

అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఇంటర్నల్‌గా సపోర్ట్‌ చేశారని.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన తన కుమారుడి గెలుపుకోసం పనిచేశారని కామెంట్స్‌ వినిపించాయి. తన కేడర్‌నంతా కమలంపార్టీకి పంపి అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని ప్రచారం ఉంది. అయితే ఇలాంటి విమర్శలను DS పైకి ఖండిస్తూ వచ్చారు.  మరి.. రాజకీయంగా డీఎస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది అనుచరుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోందట. రాజ్యసభ సభ్యుడిగా పాలిటిక్స్‌కు గుడ్‌బై చెబుతారా? సొంత గూటికి వెళ్తారా లేక.. బీజేపీలో చేరి మళ్లీ యాక్టివ్‌ అవుతారా అన్నది తెలియడం లేదట. 

డీఎస్‌ కదలికలపై నిఘా పెట్టిన టీఆర్‌ఎస్‌ నేతలు!

గతంలో డీఎస్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. బయటకు పంపేయాలన్నారు. దీంతో మనస్తాపం చెందిన డీఎస్‌.. సీఎం కేసీఆర్‌ను కలుద్దామని ప్రయత్నించినా అపాయింట్‌మెంట్‌  దొరకలేదు. రోజుల తరబడి ఎదురు చూశారు. ఇక లాభం లేదనుకుని అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉండిపోయారు. ప్రస్తుతం DS కదలికలపై  పార్టీలోని కొందరు సీనియర్‌ నేతలు  నిఘా పెట్టినట్లు సమాచారం. బీజేపీకి చెందిన కొందరు పెద్ద నేతలు ఆయనతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నారని తెలుసుకున్నారట. 

కాంగ్రెస్‌, బీజేపీలలో ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారా?

కాంగ్రెస్‌, బీజేపీలలో ఏ పార్టీవైపు వెళ్లాలో శ్రీనివాస్‌ తేల్చుకోలేకపోతున్నట్లు ఆయన వర్గం చెబుతోంది. కుమారుడు అడిగినప్పుడు బీజేపీవైపు.. పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు కాంగ్రెస్‌ బెటర్‌ అనుకుంటున్నారట. ఇప్పటికైతే DS కేడర్‌ అంతా బీజేపీలో కొనసాగుతోంది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి చాణక్యం ప్రదర్శించిన ఆయన.. తన వరకూ వచ్చే సరికి ఏం తేల్చుకోలేకపోవడం విచిత్రంగా ఉందంటున్నారు అనుచరులు.