జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య...

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య...

నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఆర్ఎం రావుకు సూచించారు ఎంపీ కవిత... కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో జరిగిన మైనార్టీ సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటు ఎంపీ కవిత పాల్గొన్నారు. సంగారెడ్డి డీఈవో జర్నలిస్టులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని జారీ చేసిన ఉత్తర్వులను ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు కవిత.

ఉర్దూ జర్నలిస్టుల కుటుంబ సభ్యుల సీఎంఆర్‌ఎఫ్ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ కవిత... వీలైనంత త్వరగా సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు విడుదలయ్యేలా చూడాలని ఆమె కోరారు. మరోవైపు ఎంపీ కవితపై ప్రశంసల వర్షం కురిపించారు డిప్యూటీ సీఎం... నిజామాబాద్ జిల్లాను ఎంపీ కవిత అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన కొనియాడారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లింలకు 800 ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేశామని తెలిపిన డిప్యూటీ సీఎం... టీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి జరుగుతోందన్నారు. మరోవైపు సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత మైనార్టీ విద్యార్థులకు సైకిళ్లు, మత్స్యకారులకు లూనాలను పంపిణీ చేశారు.