కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి

కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి

బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్... శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనకు సంబంధించిన ఫుటేజ్‌ను సకాలంలో సమర్పించకపోవడంతో వారిని శాసనసభ్యులుగానే పరిగణించాలంటూ కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై ఎలాంటి ముందడుగు పడకపోవడంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును స్పీకర్ వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. 

ఎమ్మెల్యేలకు అనుకూలంగా వచ్చిన తీర్పును అమలుచేయకపోవడంపై దేశవ్యాప్తంగా చర్చకు పెడతామన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఈ విషయంపై గవర్నర్, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కేసీఆర్... దేశం మొత్తం తిరిగి నీతులు చెబుతున్నారని... ఇక్కడ మాత్రం రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదంటూ మండిపడ్డ ఉత్తమ్... అకాల వర్షంతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులు అంతా రైతుల నష్టాన్ని అంచనా వేసి అధికారులకు తెలపాలని పిలుపునిచ్చారు. రైతులకు పరిహారం అందేలా చూడాలని కోరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే విషయంలో ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదని... ఈ విషయంపై స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తామన్నారాయన.