10,600 దిగువన క్లోజైన నిఫ్టి

10,600 దిగువన క్లోజైన నిఫ్టి

సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసినట్లు కన్పిస్తున్నా.. చిన్న షేర్లలో భారీ అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నా..మన మార్కెట్‌ మాత్రం డల్‌గా ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 35 పాయింట్ల నష్టంతో 10,596 అంటే 10,600 దిగువన ముగిసింది. యూరో మార్కెట్లలో డాక్స్‌ ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతుండగా, అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉన్నాయి. సోమవారం జరిగే ఆర్‌బీఐ క్రెడిట్‌ పాలసీ మీటింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిన్న షేర్లలో భారీ అమ్మకాలు జరుగుతున్నాయి.

సోమవారం ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెజారిటీ బ్రోకర్లు మాత్రం పెంపుదల ఆగస్టులో ఉండొచ్చని అంటున్నారు. ఈ అనిశ్చితి మధ్యలో అధిక స్థాయిల వద్ద లాంగ్‌ పొజిషన్స్‌కు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. పైగా జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్ట్స్‌ ప్రీమియం కూడా అధికంగా ఉండటం సూచీల ప్రస్తుత నిస్తేజానికి కారణమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఇక నిఫ్టి షేర్లలో సిప్లా 4 శాతంపైగా లాభపడింది. బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌పీసీఎల్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీస్‌ లాభాల్లో ముగిశాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూడు శాతం నష్టంతో ముందుంది. టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ షేర్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి.