నిలకడగా ముగిసిన మార్కెట్‌

నిలకడగా ముగిసిన మార్కెట్‌

ఆసియా మార్కెట్లన్నీ అనిశ్చితిలో ముగిశాయి.  నిఫ్టి నికలడగా ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 20 పాయింట్లు పెరిగి 10536 వద్ద ముగిసింది. మిడ్‌ సెషన్‌ తరవాత యూరో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నా... మన మార్కెట్లపై పెద్ద ప్రభావం పడలేదు. ఎస్‌బీఐ షేర్‌ ఏకంగా నాలుగు శాతం పెరగడం విశేషం. ఇవాళ బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. బ్యాంక్‌ నష్టం మార్కెట్‌ అంచనాల కంటే తక్కువగా ఉండటంతో ఈ కౌంటర్‌లో కొనుగోళ్ళు ఊపందుకున్నాయి.

నిఫ్టి షేర్లలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ అత్యధికంగా 6 శాతం లాభపడగా, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ అయిదు శాతం లాభపడింది. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మూడున్నర శాతం నష్టంతో టాప్‌లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో పాటు ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించనుందన్న వార్తలతో ఈ కౌంటర్‌లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. అల్ర్టాటెక్‌ సిమెంట్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఇండస్‌ ఇండ్‌, ఏషియన్‌ పెయింట్స్ షేర్లు నష్టాలతో ముగిశాయి. ఇక బీఎస్‌ఇలో స్ట్రయిడ్స్‌ షాసన్‌ (స్టార్‌) షేర్‌ 15 శాతం లాభపడగా, పీసీ జ్యువల్లర్స్‌ కూడా 15 శాతం లాభంతో ముగిసింది. బలరామ్ పూర్‌ చినీ, ఎన్‌సీసీ, జేపీ అసోసియేట్స్‌ షేర్లు 9 శాతంపైగా లాభపడ్డాయి.